1 సమూయేలు 2

2
హన్నా ప్రార్థన
1హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది:
“నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది;
యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది.
నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది,
మీ విడుదలలో నాకు ఆనందము.
2“యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు;
మీరు తప్ప మరి ఎవరు లేరు;
మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.
3“అంత గర్వంగా మాట్లాడకండి
మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి,
ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు
ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.
4“శూరుల విల్లులు విరిగిపోయాయి,
కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు.
5తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు,
కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు.
గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది,
కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది.
6“మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే;
పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.
7పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే;
తగ్గించేది హెచ్చించేది ఆయనే.
8దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది
పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;
వారిని అధికారులతో కూర్చునేలా చేసేది
ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే.
“భూమి పునాదులు యెహోవాకు చెందినవి;
ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.
9ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు,
అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు.
“బలం వలన ఎవరూ గెలవలేరు;
10యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు.
పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు;
భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు.
“ఆయన తన రాజుకు బలాన్నిస్తారు
తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”
11తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు.
దుర్మార్గులైన ఏలీ కుమారులు
12ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు. 13ప్రజల విషయంలో యాజకులు చేస్తూ వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి అర్పిస్తే, దాని మాంసం ఉడుకుతుండగా యాజకుని సేవకులు మూడు ముళ్ళ కొంకి గరిటెను తీసుకువచ్చి, 14పెనంలో గాని కడాయిలోగాని పాత్రలోగాని కుండలోగాని దానిని గుచ్చినప్పుడు ఆ కొంకితో పాటు బయటకు వచ్చిన మాంసమంతా యాజకుడు తన కోసం తీసుకుంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరికి వీరు ఇలాగే చేస్తూ వచ్చారు. 15అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు.
16అయితే వారు అతనితో, “మొదట క్రొవ్వును దహించనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు” అని చెప్తే ఆ సేవకుడు, “అలా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి; నీవు ఇవ్వకపోతే నేనే బలవంతంగా తీసుకుంటాను” అని అనేవాడు.
17ఆ యువకుల ఈ పాపం యెహోవా దృష్టిలో చాలా ఘోరమైనది, ఎందుకంటే వారిని బట్టి ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించడానికి అసహ్యించుకున్నారు.
18అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు#2:18 లేదా యాజకుల వస్త్రం ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. 19ప్రతి సంవత్సరం అతని తల్లి తన భర్తతో కలిసి వార్షిక బలి అర్పించడానికి వెళ్లినప్పుడు అతనికి ఒక చిన్న వస్త్రాన్ని తయారుచేసి తీసుకెళ్లేది. 20అప్పుడు ఏలీ, ఎల్కానాను, అతని భార్యను, “ఈ స్త్రీ యెహోవాకు ప్రతిష్ఠించిన బిడ్డ స్థానంలో యెహోవా ఈమె ద్వారా మీకు పిల్లలను ప్రసాదించుగాక” అని అంటూ దీవించాడు. 21యెహోవా హన్నా మీద దయ చూపించాడు; ఆమె ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కన్నది. అదే సమయంలో, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదిగాడు.
22ఇక చాలా ముసలివాడై ఏలీ, ఇశ్రాయేలీయులందరి పట్ల తన కుమారులు చేస్తున్న వాటి గురించి, వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారనే విషయాన్ని గురించి విన్నాడు. 23కాబట్టి అతడు వారితో, “మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీరు చేసిన ఈ దుష్టమైన పనుల గురించి ప్రజలందరి నోటి నుండి నేను విన్నాను. 24నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్న ఈ విషయం యెహోవా ప్రజల మధ్యలో వ్యాపించడం మంచిది కాదు. 25ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు ఆ అపరాధికి మధ్యవర్తిత్వం చేయవచ్చు; గాని ఎవరైనా యెహోవాకే వ్యతిరేకంగా పాపం చేస్తే వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు?” అన్నాడు. అయితే వారిని చంపడం యెహోవా చిత్తం, కాబట్టి వారు తమ తండ్రి గద్దింపు వినలేదు.
26మరోవైపు బాలుడైన సమూయేలు యెహోవా దయలో మనుష్యుల దయలో ఎదుగుతూ ఉన్నాడు.
ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా ప్రవచనం
27తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా? 28అతడు నా సన్నిధిలో నాకు యాజకునిగా ఉండి ఏఫోదు ధరించి, నా బలిపీఠం దగ్గరకు వెళ్లి ధూపం వేయడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి నేను నీ పూర్వికున్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమబలులన్నిటిని నీ పూర్వికుని కుటుంబానికి ఇచ్చాను. 29నా నివాసం కోసం నేను నిర్దేశించిన నా బలిని, అర్పణను ఎందుకు తృణీకరిస్తున్నారు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతి అర్పణలో శ్రేష్ఠమైన భాగాలతో క్రొవ్వెక్కేలా చేసుకుని ఎందుకు నీవు నా కంటే నీ కుమారులను ఎక్కువగా గౌరవిస్తున్నావు?’
30“కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు. 31వృద్ధాప్యం వచ్చేవరకు ఎవరూ దానిలో ఉండకుండ నేను నీ బలాన్ని నీ యాజక కుటుంబ బలాన్ని తగ్గించే సమయం రాబోతుంది, 32నా నివాసంలో అపాయం రావడం నీవు చూస్తావు. ఇశ్రాయేలుకు మేలు జరిగినప్పటికీ, మీ కుటుంబంలో ఎవరూ వృద్ధాప్యానికి చేరుకోరు. 33నా బలిపీఠం దగ్గర ఎవరూ సేవ చేయకుండా నేను నాశనం చేసే నీ వారి వలన నీ కళ్ళు మసకబారతాయి, నీ బలం క్షీణించిపోతుంది. నీ సంతానమంతా యవ్వన వయస్సులో ఉండగానే చస్తారు.
34“ ‘మీ ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫీనెహాసులకు ఏమి జరుగుతుందో తెలియడానికి ఒక సూచనగా వారిద్దరు ఒకేరోజున చనిపోతారు. 35తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు. 36అప్పుడు మీ కుటుంబంలో మిగిలిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక వెండి ముక్క కోసం రొట్టె కోసం అతని ముందు నమస్కరించి, “నాకు తినడానికి ఆహారం లేక కష్టంగా ఉంది, నన్ను ఏదైనా యాజక సేవలో నియమించండి” ’ అని వేడుకుంటారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 2: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి