1 థెస్సలొనీకయులకు 4

4
దేవునికి ఇష్టులుగా జీవించుట
1సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇక ముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. 2ప్రభువైన యేసులో గల అధికారంతో మేము మీకు ఏమి బోధించామో మీకు తెలుసు.
3మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; 4మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి. 5యూదేతరులారా కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. 6ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకొని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు. 7పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. 8కనుక ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు.
9ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కనుక మీలో ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు. 10నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న దేవుని కుటుంబమంతటికి ప్రేమ చూపిస్తున్నారు. అయినా సహోదరీ సహోదరులారా, మీరు ఇంకా అధికంగా ప్రేమించాలని చెప్తున్నాం. 11ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 12అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.
మరణించిన విశ్వాసులు
13సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల్లా దుఃఖించకండి. 14యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కనుక, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతోపాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము. 15ప్రభువు చెప్పిన మాటను బట్టి మేము మీతో చెప్పేది ఏంటంటే, ప్రభువు తిరిగి వచ్చేవరకు బ్రతికివుండే మనం చనిపోయినవారికంటె ముందుగా ఆయన సన్నిధికి చేరము. 16ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు. 17ఆ తరువాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోవడానికి ఆకాశమండలానికి మేఘాల మీద తీసుకుపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము. 18ఆ కారణాన్ని బట్టి, మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 థెస్సలొనీకయులకు 4: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి