1 తిమోతికి 4

4
1చివరి దినాలలో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి మోసపరచే ఆత్మలను, దయ్యాలచే బోధించబడే వాటిని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2కాలుతున్న ఇనుము చేత కాల్చబడిన మనస్సాక్షి కలిగిన వంచకులైన అబద్ధికుల నుండి అలాంటి బోధలు వస్తాయి. 3వారు ప్రజలను వివాహం చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నింటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు. 4కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కనుక మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. 5ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది.
6ఈ విషయాలను సహోదరి సహోదరులకు తెలియజేసినట్లైతే, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమైన సత్యాలు మంచి బోధలలో పోషించబడి క్రీస్తు యేసుకు మంచి సేవకునిగా ఉంటావు. 7నిరాధారమైన కల్పితకథలకు, ముసలమ్మల ముచ్చట్లకు దూరంగా ఉండి, దైవభక్తిలో నీకు నీవే శిక్షణ ఇచ్చుకో. 8శారీరక వ్యాయామం వలన కొంతవరకు లాభం కలుగుతుంది, అయితే ప్రస్తుత జీవితానికి రాబోవు జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన దైవభక్తి అన్ని విషయాలలో విలువైనది. 9ఈ మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. 10అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.
11ఈ విషయాలను ఆజ్ఞాపించి బోధించు. 12నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో. 13నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో. 14సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహింపబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
15ఈ విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండు; నీ అభివృద్ధి అందరికి స్పష్టంగా కనబడేలా నీవు వాటిని పూర్తిగా ఆచరించు. 16నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 తిమోతికి 4: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి