10
పౌలు తన పరిచర్య కోసం పోరాటం
1క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాన్ని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.” 2ఈ లోక పద్ధతులతో మేము జీవిస్తున్నామని భావించే కొందరితో ధైర్యంగా వ్యవహరించాలని అనుకుంటున్నాను, కాని నేను అక్కడికి వచ్చినప్పుడు అలా జరగకుండా ఆపాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 3మేము ఈ లోకంలో జీవించినా ఈ లోకంలా మేము పోరాటం చేయము. 4మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు. 5వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము. 6మీ విధేయత సంపూర్ణమైన తర్వాత అవిధేయతనంతటిని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
7పైకి కనబడే వాటిని#10:7 లేదా స్పష్టంగా కనిపించే వాటిని బట్టి చూస్తున్నారు. ఎవరైనా తాము క్రీస్తుకు చెందిన వారమని నమ్మితే, వారిలా మేము కూడా క్రీస్తుకు చెందినవారమే అని మరల వారు ఎంచాలి. 8పడగొట్టడానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు మాకు ఇచ్చిన అధికారాన్ని గురించి ఒకవేళ నేను గొప్పలు చెప్పుకొన్నా దాని కోసం నేను సిగ్గుపడను. 9నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. 10“ఇతని పత్రికలు గొప్పగా శక్తివంతంగా ఉంటాయి కాని వ్యక్తిగా అతడు బలహీనుడు అతని మాటలు విలువలేనివి” అని కొందరు అన్నారు. 11మేము లేనప్పుడు పత్రికల్లో ఏమి వ్రాసామో మేము అక్కడ ఉన్నప్పుడు మేము అదే చేస్తామని అలాంటివారు గ్రహించాలి.
12తమను తామే పొగడుకునే వారితో జత చేరడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే బేరీజు వేసుకుంటూ తమలో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థము. 13మేమైతే పరిమితికి మించి పొగడుకోం, అయినా, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన హద్దుల్లోనే ఉన్నాము, ఆ హద్దులో మీరు కూడా ఉన్నారు. 14క్రీస్తు సువార్తతో మేము మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీ దగ్గరకు మేము రానట్లుగానే మేము పొగడుకోవడంలో మా హద్దులు మీరడం లేదు. 15ఇతరులు చేసిన పనుల గురించి మా హద్దులు దాటి మేము గొప్పలు చెప్పము. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతూ, మీ మధ్యలో మేము పని చేయాల్సిన ప్రాంతం విస్తరించాలని మా నిరీక్షణ. 16అప్పుడు మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఈ సువార్తను బోధించగలము. కాబట్టి వేరొకరి ప్రాంతంలో ఇంతకుముందే జరిగిన పని గురించి మేము పొగడుకోవాలని కోరడంలేదు. 17అయితే, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి.”#10:17 యిర్మీయా 9:24 18తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు.