2
1కనుక మీకు దుఃఖం కలిగించకుండా ఉండడానికి మరల నేను మిమ్మల్ని చూడను. 2ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, ఇక నన్ను సంతోషపెట్టడానికి మిగిలేది ఎవరు? నేను దుఃఖంలో విడిచిపెట్టిన వ్యక్తులే కదా? 3కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాసాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకం. 4ఎంతో దుఃఖపూరిత హృదయంతో, కన్నీటితో మీకు వ్రాసాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు గాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.
దోషికి క్షమాపణ
5ఎవడైనా దుఃఖం కలిగిస్తే, నాకు మాత్రమే గాక మీ కందరికిని దుఃఖం కలిగించినట్లే. ఇంతకంటే తీవ్రంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 6అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధింపబడిన శిక్షే చాలు. 7కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో. 8అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 9మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాలలో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోడానికి నేను అలా వ్రాసాను. 10మీరు క్షమించేవాన్ని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కొరకే క్రీస్తు ముందు అలా చేశాను. 11సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలను మనం ఎరుగని వారం కాము.
క్రొత్త నిబంధన పరిచారకులు
12క్రీస్తుని గురించిన సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పనికి అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను. 13కాని మన సోదరుడు తీతును నేను అక్కడ కనుగొనక పోవడంతో మనస్సులో చాలా విచారించాను. కనుక అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాను.
14కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు. 15ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు యొక్క పరిమళంగా ఉన్నాం. 16ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాం. కనుక, అలాంటి కార్యానికి యోగ్యుడు ఎవడు? 17మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కొరకు అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన యెదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని మాకు తెలుసు.