2 కొరింథీ 4

4
ప్రస్తుత బలహీనత మరియు పునరుత్థాన జీవితం
1దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగివున్నాము, కనుక మేము ధైర్యాన్ని కోల్పోము. 2అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. 3ఒకవేళ మేము బోధించే సువార్త, ఎవరికైనా ముసుగుగా ఉంటే, అది నశించేవారికి మాత్రమే ముసుగుగా ఉంటుంది. 4దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుబరచే సువార్త వెలుగును వారు చూడకుండా ఈ యుగసంబంధమైన దేవత, అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది. 5ఎందుకంటే, మేము బోధిస్తుంది మా గురించి కాదు, కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కొరకు మేము మీ సేవకులమని బోధిస్తున్నాము. 6“చీకటి నుండి వెలుగు కలుగును గాక”#4:6 ఆది 1:3 అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు.
7అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవుని నుండి కలిగిందే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగివున్నాము. 8మేము అన్ని వైపుల నుండి కఠినంగా అణిచివేయబడ్డాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు; 9హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు. 10మా శరీరంలో యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాం. 11మా క్షయమైన శరీరంలో యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాం. 12కనుక మాలో మరణం పనిచేస్తుంది, కాని మీలో జీవం పనిచేస్తుంది.
13“నేను విశ్వసించాను; కనుక మాట్లాడాను”#4:13 కీర్తన 116:10 అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కనుక మేము కూడా విశ్వసిస్తున్నాము, మాట్లాడుతున్నాము, 14ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతోపాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు మమ్మల్ని తన యెదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.
16కనుకనే, మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము. 17మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి. 18కనుక కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 కొరింథీ 4: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి