2 సమూయేలు 15

15
అబ్షాలోము కుట్ర
1కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు. 2అతడు ఉదయాన్నే లేచి పట్టణ ద్వారానికి వెళ్లే దారి ప్రక్కన నిలబడేవాడు. రాజు తీర్పు పొందడానికి ఎవరైనా ఫిర్యాదులతో వస్తే అబ్షాలోము వారిని పిలిచి, “మీది ఏ ఊరు?” అని అడిగేవాడు. “నీ సేవకుడైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలాన దానికి చెందిన వాడినని” ఆ వ్యక్తి చెప్పినప్పుడు, 3అప్పుడు అబ్షాలోము, “చూడు, నీ ఫిర్యాదులు విలువైనవి, సరియైనవే కాని, వాటిని వినడానికి రాజు ప్రతినిధులెవరు లేరు” అని అనేవాడు. 4ఇంకా అబ్షాలోము, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.
5అలాగే, ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్షాలోము తన చేయి చాచి, అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు. 6తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఇలానే మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
7ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి. 8నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.
9రాజు అతనితో, “సమాధానంగా వెళ్లు” అని చెప్పి అనుమతి ఇచ్చాడు. కాబట్టి అతడు హెబ్రోనుకు వెళ్లాడు.
10అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు. 11యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు. 12అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.
దావీదు పారిపోవుట
13ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు.
14దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
15అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు.
16అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు. 17రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు. 18రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.
19రాజు గిత్తీయుడైన ఇత్తయితో, “నీవు మాతో పాటు రావడం ఎందుకు? తిరిగివెళ్లి అబ్షాలోము రాజుతో పాటు ఉండు. నీవు బందీగా ఉన్న విదేశీయుడవు. 20నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు.
21అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.
22దావీదు ఇత్తయితో, “సరే, నీవు మాతో రావచ్చు” అన్నాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి అతనితో ఉన్న మనుష్యులు, కుటుంబాలు ముందుకు నడిచారు.
23వారందరూ వెళ్లి పోతుంటే ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ఇలా వారందరూ రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి అరణ్యమార్గంలో కదిలారు.
24సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు.
25అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు. 26ఒకవేళ ఆయన, ‘నీపై నాకు దయలేదు’ అని చెప్పినా సరే నేను అందుకు సిద్ధమే; ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే నా పట్ల అదే చేస్తారు” అని చెప్పాడు.
27రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి. 28నీ దగ్గర నుండి నాకు కబురు వచ్చేవరకు నేను అరణ్యంలో ఉన్న రేవుల దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను” అన్నాడు. 29కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.
30దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చాడు. తన తల కప్పుకుని, చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లాడు. అతనితో ఉన్నవారందరు తల కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు. 31ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.
32ప్రజలు దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరుకున్నప్పుడు అర్కీయుడైన హూషై తన పైవస్త్రాన్ని చింపుకుని తలమీద బూడిద పోసుకున్నాడు. 33దావీదు అతన్ని చూసి, “నీవు నాతో పాటు వస్తే నాకు భారంగా ఉంటుంది. 34నీవు పట్టణానికి తిరిగివెళ్లి అబ్షాలోముతో, ‘రాజా! నేను నీకు సేవకునిగా ఉంటాను. గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను కాని ఇకపై నీకు సేవకునిగా సేవ చేస్తాను’ అని చెప్పు, అప్పుడు నీవు నా తరుపున అక్కడ ఉండి అహీతోపెలు చేసే సలహాలను చెడగొట్టగలవు. 35యాజకులైన సాదోకు అబ్యాతారులు నీతో అక్కడ ఉంటారు. రాజభవనంలో నీవు విన్నవాటినన్ని వారికి చెప్పు. 36వారి ఇద్దరు కుమారులు, సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అక్కడ వారితో పాటు ఉన్నారు. నీవు ఏది విన్నా, వారి ద్వారా నాకు తెలియజేయి” అని చెప్పాడు.
37కాబట్టి అబ్షాలోము యెరూషలేముకు వస్తున్నప్పుడే దావీదు స్నేహితుడైన హూషై పట్టణానికి తిరిగి వెళ్లాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 15: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి