2
యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన సైనికుడు
1నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు. 2అనేకమంది సాక్షుల సమక్షంలో నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగల నమ్మకమైన వారికి అప్పగించు. 3యేసు క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు. 4యుద్ధానికి వెళ్ళే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాలలో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. 5అదే విధంగా ఒక క్రీడాకారుడు క్రీడానియమాల ప్రకారం పందెంలో పాల్గొంటేనే తప్ప విజయ కిరీటాన్ని పొందుకోలేడు. 6అలాగే పంటలోని భాగం మొదటిగా పొందాల్సింది కష్టపడి పని చేసే రైతే. 7నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు, మన ప్రభువు నీకు అన్ని విషయాలను తెలుసుకోగల పరిజ్ఞానాన్ని దయచేస్తారు.
8మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. యిదే నేను ప్రకటించిన సువార్త. 9దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు. 10కనుక, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసుక్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.
11ఈ మాట నమ్మదగింది:
మనం ఆయనతోపాటు చనిపోతే,
ఆయనతోపాటు మనం కూడా జీవిస్తాము;
12మనం భరిస్తే,
ఆయనతోపాటు మనం కూడా ఏలుతాము.
మనం ఆయనను తిరస్కరిస్తే,
ఆయన కూడా మనలను తిరస్కరిస్తారు;
13మనం నమ్మకంగా లేకపోయినా,
ఆయన నమ్మకంగానే ఉంటారు,
ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
అబద్ధ బోధకులు
14దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని యెదుట వారిని హెచ్చరించు. 15ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు. 16దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు. 17వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు. 18వారు సత్యాన్ని వదిలిపెట్టారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు. 19అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచివుండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడివుంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”
20ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి. 21అదే విధంగా, ఎవరైనా తమను తాము శుద్ధిచేసుకొనేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కొరకు సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు.
22యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు. 23మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు. 24ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు. 25దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి. 26అప్పుడు వారు తమ తప్పును తెలుసుకొని, తన ఇష్టాన్ని చేయడానికి వారిని చెరలోనికి తీసుకుపోయిన సాతాను యొక్క ఉచ్చులో నుండి తప్పించుకోగలరు.