అపొస్తలుల కార్యములు 10:9-23

అపొస్తలుల కార్యములు 10:9-23 TCV

వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు. అతనికి చాలా ఆకలివేసి ఏమైనా తినాలని అనిపించింది, భోజనం సిద్ధం చేస్తుండగా అతడు స్వాప్నిక స్థితిలోనికి వెళ్లాడు. అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగుమూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూసాడు. దానిలో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు మరియు పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం అతనితో, “పేతురు నీవు లేచి, వాటిని చంపి తిను” అని చెప్పడం వినబడింది. అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపవిత్రమైనది అపరిశుభ్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. రెండవ సారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది. ఈ విధంగా మూడుసార్లు జరిగింది, వెంటనే ఆ దుప్పటి తిరిగి ఆకాశానికి తీసుకుపోబడింది. పేతురు ఆ దర్శనానికి భావం ఏమిటని ఆశ్చర్యపడుతున్నప్పుడు, కొర్నేలీ పంపినవారు, సీమోను ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకొని దాని ద్వారం ముందు నిలబడ్డారు. ఇంటి వారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. పేతురు ఇంకా ఆ దర్శనం గురించి ఆలోచిస్తుండగా, ఆత్మ అతనితో “సీమోను నీ కొరకు ముగ్గురు వ్యక్తులు చూస్తున్నారు. నీవు లేచి క్రిందికి వెళ్లు. నేనే వారిని పంపించాను, కనుక నీవు వారితో వెళ్లడానికి సందేహించకు” అని చెప్పారు. పేతురు క్రిందికి వెళ్లి వారితో, “మీరు వెదికేది నాకోసమే, మీరు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు వారు, “కొర్నేలీ అనే శతాధిపతి వద్దనుంచి మేము వచ్చాము. అతడు నీతిమంతుడు మరియు దేవుని భయం గలవాడు, యూదులందరిచే గౌరవించబడుతున్నవాడు. నీవు చెప్పేది వినడానికి నిన్ను ఇంటికి పిలుచుకొని రమ్మని ఒక పరిశుద్ధ దేవదూత అతనితో చెప్పాడు” అన్నారు. అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు.