అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: “తోటి యూదులారా మరియు యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది! యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:
“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో,
నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,
మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు.
ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద,
నా ఆత్మను కుమ్మరిస్తాను,
అప్పుడు వారు ప్రవచిస్తారు,
నేను పైన ఆకాశంలో నా అద్బుతాలను,
క్రింద భూమి మీద నా సూచక క్రియలను,
రక్తం, అగ్ని, పొగ మేఘాన్ని చూపిస్తాను.
మహా మహిమ గల ప్రభువు దినము రావడానికి
సూర్యుడు చీకటిగా
మరియు చంద్రుడు రక్తంగా మారుతాడు.
అయితే ప్రభువు పేరట మొరపెట్టిన
ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’
“తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కొరకు దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్బుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కనుక దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు. దావీదు ఆయన గురించి ఇలా అన్నారు:
“ ‘ఎల్లప్పుడు నేను నాయెదుట నా ప్రభువును చూస్తున్నాను.
నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు,
కనుక నేను కదల్చబడను.
కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;
నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది,
ఎందుకంటే నీవు నా అంతరాత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధుని కుళ్ళి పోనీయవు.
నీవు నాకు జీవ మార్గాన్ని తెలిపావు;
నీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతావు.’
“తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో ధైర్యంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ఒక ప్రవక్త మరియు దేవుడు అతని సంతానంలోని ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోపెడతానని ఒట్టుపెట్టుకొని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు. రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు. దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులం. దేవుని కుడి చేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీ మీద కుమ్మరించారు. దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు,
“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి వైపున కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
“కనుక ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా మరియు క్రీస్తుగా చేశారు.”
ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు.
అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు మరియు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.
ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకొన్నారు, ఆ రోజు సుమారుగా మూడు వేలమంది చేర్చబడ్డారు.