ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అక్కడ ముఖ్య యాజకులు మరియు యూదా నాయకులు అతన్ని కలిసి పౌలుకు వ్యతిరేకంగా తాము చేసిన ఫిర్యాదును తెలియజేసారు. వెళ్తున్నప్పుడే మధ్యలో పౌలును చంపాలని కుట్రను పన్ని, పౌలును యెరూషలేముకు పంపించమని ఫేస్తును వేడుకొన్నారు. అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను. కనుక మీలో కొందరు నాయకులు నాతో రండి. అతడు ఏమైన తప్పు చేస్తే అది అతనిపై మోపవచ్చు” అని చెప్పాడు. వారితో ఎనిమిది, పది రోజులు గడిపిన తర్వాత ఫేస్తు అధిపతి కైసరయకు వెళ్లాడు. మరుసటిరోజు అతడు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. పౌలు లోపలికి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడ్డారు. అతని మీద అనేక తీవ్ర ఆరోపణలు చేశారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు. అప్పుడు పౌలు సమాధానం చెప్పుతూ, “నేను యూదుల ధర్మశాస్త్రానికి గాని దేవాలయానికి గాని లేదా కైసరుకు గాని వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదు” అని చెప్పాడు. ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు. అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు. ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు. ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కనుక నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు. కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు. వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కనుక ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు. నేను యెరూషలేము పట్టణానికి వెళ్లినప్పుడు, ముఖ్య యాజకులు యూదా నాయకులు అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి అతన్ని శిక్షించమని కోరారు. “అందుకు నేను ‘ఎవరినైనా సరే నేరం మోపిన వారిని కలుసుకొని, తమ వాదన వినిపించుకొనే అవకాశం ఇవ్వకుండా అప్పగించడం అనేది రోమీయుల ఆచారం కాదు’ అని వారితో చెప్పాను. వారు నాతో ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఈ విషయంలో ఆలస్యం చేయకుండా, న్యాయసభను సమావేశపరిచి మరునాడే ఆ వ్యక్తిని తీసుకొని రమ్మని ఆదేశించాను. అతని మీద ఫిర్యాదు చేసినవారు నేను ఊహించిన ఏ నేరాన్ని మోపలేదు. దానికి బదులు అతనితో వారికున్న మతసంబంధమైన, యేసు అనే ఒక వ్యక్తి చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడనే కొన్ని వివాదాలను తెలియచేశారు. ఇలాంటి విషయాలను ఏ విధంగా విచారించాలో నాకు అర్థం కాలేదు; కనుక యెరూషలేము వెళ్లి అక్కడ వారి ఫిర్యాదుకు విచారణ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నావా అని అతన్ని అడిగాను. కానీ పౌలు తాను చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేసినప్పుడు, నేను అతన్ని కైసరు దగ్గరకు పంపించే వరకు అతన్ని అక్కడే ఉంచుమని ఆదేశించాను” అని చెప్పాడు.
Read అపొస్తలుల కార్యములు 25
వినండి అపొస్తలుల కార్యములు 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 25:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు