5
అననీయ, సప్పీరా
1అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు. 2అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
3అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? 4అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.
5అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. 6అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు.
7మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది. 8పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు.
అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాం” అని జవాబిచ్చింది.
9అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు.
10ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు. 11సంఘంలో మరియు ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.
అనేకమందిని స్వస్థపరచిన అపొస్తలులు
12అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచక క్రియలను, అద్బుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు. 13ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. 14అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు మరియు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు. 15అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకొనివచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధులలో పరుపు మీద పడుకోబెట్టారు. 16యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకొని వచ్చిన రోగులు మరియు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు.
అపొస్తలులను హింసించుట
17ప్రధాన యాజకుడు మరియు అతనితో పాటు ఉన్నవారంతా, అనగా సద్దూకయ్యుల తెగవారు అసూయతో నిండుకొన్నారు. 18కనుక వారు అపొస్తలులను పట్టుకొని పట్టణపు చెరసాలలో వేయించారు. 19కానీ ప్రభువు దూత ఆ రాత్రి వేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటికి తీసుకువచ్చి, 20“వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు.
21తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు.
ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు. 22వారు చెరసాలకు వచ్చి చూసినపుడు వారక్కడ కనబడలేదు. ఆ అధికారులు తిరిగి వెళ్లి న్యాయసభ వారికి, 23“మేము వెళ్లినప్పుడు చెరసాల జాగ్రత్తగానే తాళం వేయబడి కాపలావారు తలుపుల దగ్గర నిలబడే ఉన్నారు; కానీ మేము తలుపులు తెరిచినప్పుడు, లోపల మాకు ఎవరు కనబడలేదు” అని చెప్పారు. 24ఆ మాటలు విని, దేవాలయ కాపలా అధికారి మరియు ప్రధాన యాజకులు కలవరంతో, ఇది దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందారు.
25అప్పుడు ఒకడు వచ్చి, “చూడండి, మీరు చెరసాలలో పెట్టినవారు దేవాలయ ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26వెంటనే కాపలా అధికారి తన సేవకులతో వెళ్లి, అపొస్తలులను తీసుకువచ్చారు. ప్రజలు తమను రాళ్లతో కొడతారేమో అని భయపడి, వారు బలప్రయోగం చేయలేదు.
27ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు. 28అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు.
29అందుకు పేతురు మరియు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా! 30మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. 31ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడి చేతి వైపుకు హెచ్చించారు. 32మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.”
33న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకొని వారిని చంపాలని అనుకున్నారు. 34అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు. 35తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. 36ఎందుకంటే కొంత కాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగు వందల మంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది. 37అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజులలో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు. 38కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి. 39కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు.
40అతని మాటలను వారు అంగీకరించారు, కనుక అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు.
41ఆ నామంను బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు. 42వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాలలో మరియు ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.