6
1పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది. 2“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. 3దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”#6:3 ద్వితీ 5:16
4తండ్రులారా,#6:4 లేదా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.
5దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టు ఈ లోకసంబంధమైన మీ యజమానులకు గౌరవంతో, యథార్థ హృదయం కలవారై భయంతో లోబడి ఉండండి. 6వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా, క్రీస్తు దాసులుగా, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేస్తూ వారికి లోబడండి. 7మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి. 8ఎందుకంటే, దాసులైనా, స్వతంత్రులైనా మీలో ప్రతివారు ఏ మంచి కార్యాన్ని చేస్తారో దాని ఫలాన్ని ప్రభువు నుండి పొందుతారని మీకు తెలుసు.
9అయితే యజమానులారా, మీరు కూడా మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. ఎందుకంటే మీ ఇద్దరి యజమాని పరలోకంలో ఉన్నారు, ఆయన పక్షపాతం చూపడని మీకు తెలుసు కాబట్టి వారిని బెదిరించకండి.
దేవుని కవచం
10చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 12ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము. 13అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, 15పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. 16వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. 17రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.
18ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి పరిశుద్ధులందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి. 19సువార్త మర్మాన్ని నేను భయం లేకుండా తెలియజేయడానికి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు మాటలు అనుగ్రహించబడేలా నా కోసం కూడా ప్రార్థన చేయండి. 20దాని కొరకే నేను రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను దాన్ని ఎలా ప్రకటించాలో అలా దానిని ధైర్యంగా ప్రకటించేలా ప్రార్థించండి.
చివరి శుభవచనాలు
21ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన సేవకుడు, తుకికు, నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో మీరు కూడా తెలుసుకోవడానికి అన్ని విషయాలను మీకు చెప్తాడు. 22మేము ఎలా ఉన్నామో మీరు తెలుసుకోవాలని అతడు మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను.
23సహోదరీ సహోదరులందరికి మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ కలుగును గాక.
24మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికందరికి కృప కలుగును గాక.