13
అబద్ధ ప్రవక్తలపై తీర్పు
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ఇప్పుడు ప్రవచిస్తున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు. తమ సొంత ఊహ ఆధారంగా ప్రవచించే వారితో ఇలా చెప్పు: ‘యెహోవా మాట వినండి! 3ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ#13:3 లేదా దుష్ట ప్రవక్తలకు శ్రమ. 4ఇశ్రాయేలీయులారా! మీ ప్రవక్తలు శిథిలాల మధ్య తిరిగే నక్కల్లాంటి వారు. 5ఇశ్రాయేలు ప్రజలు యెహోవా రోజున జరిగే యుద్ధంలో స్థిరంగా నిలబడేలా మీరు గోడ పగుళ్ల దగ్గరకు వెళ్లి వాటిని బాగుచేయలేదు. 6వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు. 7నేను మాట్లాడక పోయినా ఇదే యెహోవా మాట అని మీరు చెప్పినప్పుడు మీ చూసిన దర్శనాలు వట్టి భ్రమలు భవిష్యవాణి అబద్ధమే కదా?
8“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు చెప్పే వట్టిమాటలు అబద్ధపు దర్శనాల కారణంగా నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానని ప్రభువైన యెహోవా తెలియజేస్తున్నారు. 9వ్యర్థమైన దర్శనాలు చూస్తూ అబద్ధపు సోదె చెప్పే ప్రవక్తలకు నా చేయి వ్యతిరేకంగా ఉంటుంది. వారిని నా ప్రజల సభలోనికి రానివ్వను, వారు ఇశ్రాయేలీయుల జాబితాలో నమోదు చేయబడరు, ఇశ్రాయేలీయుల దేశానికి తిరిగి రారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.
10“ ‘సమాధానం లేనప్పుడు సమాధానం అంటూ నా ప్రజలను మోసగిస్తున్నారు. ఒకరు కట్టిన బలహీనమైన గోడకు వారు సున్నం వేస్తారు. 11సున్నం వేస్తున్నవారితో అది కూలిపోతుందని చెప్పు. నేను వర్షం, వడగండ్లు కురిపించినప్పుడు బలమైన గాలులు వీచి అది పడిపోతుంది. 12గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?”
13“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను. 14మీరు సున్నం వేసిన గోడను దాని పునాది కనబడేలా నేలమట్టం చేస్తాను. ఆ గోడ#13:14 లేదా పట్టణం పడినప్పుడు దాని క్రింద మీరంతా నాశనమవుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 15ఆ గోడ మీద దానికి సున్నం వేసిన వారి మీద నా కోపం కురిపిస్తాను. అప్పుడు నేను మీతో, “గోడ లేదు దానికి సున్నం వేసినవారు కూడా లేరు, 16యెరూషలేముకు సమాధానం లేకపోయినా సమాధానం కలిగే దర్శనాలు చూసి ప్రవచించే ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా ఉండరు అని చెప్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” ’
17“మనుష్యకుమారుడా, ప్రవచిస్తున్న నీ ప్రజల కుమార్తెలకు విరోధంగా ప్రవచించి, 18వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ప్రజలను వలలో వేసుకోవడానికి తమ మణికట్టు మీద తాయెత్తులు కట్టుకుని తమ తలలపై వేసుకోడానికి వివిధ రకాల ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ. మీరు నా ప్రజల జీవితాలను ఉచ్చులో ఇరికించి, మీ సొంత ప్రాణాలను కాపాడుకుంటారా? 19మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు.
20“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను. 21నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 22ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు. 23కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”