4
యెరూషలేము ముట్టడికి సూచన
1“మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి. 2తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి. 3తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది.
4“అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి. 5ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.
6“నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను. 7ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు. 8నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.
9“గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి. 10ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ#4:10 అంటే, సుమారు 230 గ్రాములు ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి. 11అలాగే ఒక హిన్#4:11 అంటే, సుమారు 0.6 లీటర్ లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి. 12యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి. 13నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.
14అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.
15అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు.
16ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు. 17ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు.