గలతీ పత్రిక 2

2
అపొస్తలులు పౌలును అంగీకరించుట
1పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను. 2దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేశాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను. 3నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు. 4క్రీస్తు యేసులో మనకున్న స్వేచ్ఛపై నిఘా పెట్టడానికి మమ్మల్ని బానిసలుగా చేయడానికి మన మధ్యలోనికి చొరబడిన కొంతమంది అబద్ధపు విశ్వాసుల వలన ఈ విషయం తలెత్తింది. 5అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.
6కొంతమంది గొప్ప పేరుగాంచిన వారు ఉన్నప్పటికీ, వారెవరైనా సరే నేను లెక్కచేయను, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు, అయినా వారు నా సందేశానికి ఏమి చేర్చలేదు. 7సున్నతి పొందిన వారి కోసం పేతురు నియమింపబడినట్లే, సున్నతి లేనివారికి సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు గుర్తించారు. 8ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కోసం అపొస్తలునిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడే సున్నతిలేని యూదేతరుల కోసం అపొస్తలునిగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం ఇచ్చారు. 9సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు. 10అయితే వారు అడిగింది ఏంటంటే, మేము పేదవారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని వారు కోరారు; ఎప్పుడు నేను చేయాలని కోరుకునేది కూడా అదే.
కేఫాను వ్యతిరేకించిన పౌలు
11కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా నిలదీశాను. 12ఎందుకంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకముందు అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు సున్నతి చేయబడిన వారికి భయపడి వెనుకకు తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. 13ఇతర యూదులు కూడా అతని వేషధారణలో జత కలిశారు, దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి దారితప్పాడు.
14వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు?
15“మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము. 16ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసు క్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలనుబట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలనుబట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు.
17“కాని ఒకవేళ, క్రీస్తులో నీతిమంతులు కావాలని కోరుకుంటూ, యూదులమైన మనం కూడా పాపులమని తీర్చబడితే, క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్థం కాదా? కానే కాదు! 18ఒకవేళ నేను కూల్చివేసిన దానిని మరల కడితే, అప్పుడు నేను నిజంగానే అపరాధిని అవుతాను.
19“నేను దేవుని కోసం జీవించటానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను. 20నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను. 21దేవుని కృపను నేను తిరస్కరించను, ఒకవేళ, ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందుకోగలిగితే, క్రీస్తు కారణం లేకుండా చనిపోయినట్లే!”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

గలతీ పత్రిక 2: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి