హెబ్రీయులకు 11

11
క్రియలలో విశ్వాసము
1విశ్వాసమనేది మనం నిరీక్షిస్తున్న వాటిలో నమ్మకం, మనం చూడని వాటి గురించిన నిశ్చయత. 2దీన్ని గురించే పూర్వీకులు మెప్పు పొందారు.
3దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కనుక కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాం.
4విశ్వాసము ద్వారానే హేబెలు కయీను కంటె ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు.
5విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితం నుండి మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు గనుక, అతడు కనబడలేదు”#11:5 ఆది 5:24 అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు. 6విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కొరకు ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.
7విశ్వాసం ద్వారానే నోవహు, తాను ఇంకా చూడని వాటి గురించి హెచ్చరించబడినప్పుడు, పవిత్ర భయం కలిగి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండించాడు, విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.
8విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్ళమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్ళాడు. 9విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు. 10ఎందుకంటే అతడు ఎదురుచూస్తున్నది పునాదులుగల పట్టణం కొరకు, దానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు. 11వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కనుక శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె#11:11 లేదా, అబ్రాహాము పిల్లలను కనలేనంత ముసలివాడు శారా కూడా తల్లికాలేని స్ధితిలో ఉన్నప్పటికీ విశ్వాసం వల్లనే అబ్రాహాము తండ్రి కాగలిగాడు బిడ్డను కనగలిగింది. 12చనిపోయినవానితో సమానమైన ఈ ఒక్క మనుష్యుని నుండే ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యలా, సముద్ర తీరంలోని ఇసుక రేణువుల్లా లెక్కకు మించిన సంతానం కలిగింది.
13వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము పరదేశులమని అపరిచితులమని ఒప్పుకొన్నారు. 14అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కొరకు చూస్తున్నారని స్పష్టం చేస్తారు. 15వారు తాము వదలి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే, వారు తిరిగి వెళ్ళడానికి అవకాశం కలిగివుండేవారు. 16అయితే, వారు అంతకంటే ఉత్తమమైన దేశాన్ని అంటే పరలోకసంబంధమైన దేశం కొరకు ఆరాటపడ్డారు. కనుక వారి దేవుణ్ని వారి చేత పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన వారికి ఒక నగరాన్ని సిద్ధపరిచాడు.
17దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు వల్లనే నీ వంశం అభివృద్ధి చెందుతుంది”#11:17 ఆది 21:12 అని దేవుడు అతనితో చెప్పినప్పటికి, 18వాగ్దానాలను పొందిన అబ్రాహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. 19చనిపోయినవారిని సహితం లేపడానికి దేవుడు శక్తిమంతుడని అబ్రాహాము భావించాడు, దానిని ఉపమానరీతిలో చెప్పాలంటే అతడు తన కుమారుడైన ఇస్సాకును మరణం నుండి తిరిగి పొందుకున్నాడు.
20విశ్వాసం ద్వారానే ఇస్సాకు తన సంతానమైన యాకోబు ఏశావులను వారి భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు.
21విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయేటప్పుడు యోసేపు కుమారులలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, తన చేతి కర్ర మీద ఆనుకొని ఆరాధించాడు.
22విశ్వాసం ద్వారానే యోసేపు తాను చనిపోయే సమయంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చెప్పి, తన ఎముకలను సమాధి చేయమని ఆదేశాలిచ్చాడు.
23విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తరువాత మూడు నెలల వరకు దాచివుంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు.
24విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు. 25అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించడంకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకొన్నాడు. 26క్రీస్తు కొరకైన అవమానాన్ని ఐగుప్తు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. 27విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఐగుప్తును విడిచి వెళ్ళాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు. 28అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు.
29విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్ళారు; అయితే ఐగుప్తువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్ళడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
30విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
31విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కనుక అవిధేయులతో#11:31 లేదా, అవిశ్వాసులు పాటు చంపబడకుండా రక్షించబడింది.
32ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు. 33వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు, 34తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకొన్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాల్లో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు. 35కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు. 36కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు. 37వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు,#11:37 ప్రాచీన ప్రతులలో వారిని శోధించడానికి రాళ్ళు వేశారు రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకొని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు. 38ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు.
39వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు, 40ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మనకొరకు మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీయులకు 11: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి