13
ముగింపు హెచ్చరికలు
1సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి. 2క్రొత్తవారికి ఆతిథ్యం ఇవ్వడం మరువవద్దు, ఎందుకంటే క్రొత్తవారికి ఆతిథ్యం ఇస్తుండడం వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. 3చెరసాలలో ఉన్న వారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.
4వివాహం అందరిచేత గౌరవించబడాలి, వివాహ పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు. 5మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు,
“నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను;
నిన్ను ఎన్నడు త్రోసివేయను.”#13:5 ద్వితీ 31:6
6కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం,
“ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను.
మనుష్యులు నాకు ఏమి చేయగలరు?”#13:6 కీర్తన 118:6,7
7దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి. 8యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.
9అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు. 10మనకు ఒక బలిపీఠం ఉంది, అయితే ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసేవారికి దాని నుండి తీసుకొని తినే అధికారం లేదు.
11ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి పాపపరిహారార్థ బలిగా తీసుకువెళ్తాడు, కాని వాటి శరీరాలు శిబిరం బయటే దహించబడతాయి. 12కనుక, యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పాపాల నుండి శుద్ధిచేయడానికి పట్టణ ద్వారానికి బయటే బాధపడ్డాడు. 13కనుక మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాం. 14ఎందుకంటే మనకు ఇక్కడ శాశ్వతమైన పట్టణం లేదు, అయితే రాబోతున్న పట్టణం కొరకు మనం ఎదురుచూస్తున్నాము.
15కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకొనే పెదవులఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం. 16ఒకరికి ఒకరు మేలు చేసుకోవడం, ఇతరులతో పంచుకోవడం అనే త్యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైన బలి అర్పణలు.
17మీ నాయకులపై నమ్మకం కలిగి ఉండండి, వారి అధికారానికి లొంగి ఉండండి, ఎందుకంటే వారు మీ గురించి తప్పక లెక్క అప్పగించాల్సినవారిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే అది మీకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు; కనుక వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా మీరు వారికి లోబడి ఉండండి.
18మా కొరకు ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము. 19త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.
ఆశీర్వచనం మరియు చివరి శుభాలు
20నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనక్కి తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు, 21తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మంచిదానితో మిమ్మల్ని సిద్ధపరచును గాక, ఆయనకు ఇష్టమైనదాన్ని యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలో జరిగించుగాక, ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక. ఆమేన్.
22సహోదరీ సహోదరులారా! నా హెచ్చరిక మాటను భరించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, వాస్తవానికి నేను మీకు చాలా క్లుప్తంగా వ్రాసాను.
23మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.
24మీ నాయకులందరికి, ప్రభువు ప్రజలందరికి వందనాలు తెలియజేయండి.
ఇటలీ దేశపు సహోదరులు మీకు వందనాలు తెలియజేస్తున్నారు.
25కృప మీ అందరితో ఉండును గాక.