హెబ్రీ పత్రిక 2

2
శ్రద్ధ వహించాలని హెచ్చరిక
1కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. 2ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కాబట్టి, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా, 3మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది. 4సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధ రకాల అద్భుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు.
సంపూర్ణ మానవునిగా యేసు
5మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు. 6అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు:
“మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు?
మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
7మీరు వారిని దేవదూతల కంటే కొంచెం#2:7 కొంచెం కొంతకాలం వరకు తక్కువగా చేశారు;
మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.
8సమస్తాన్ని వారి పాదాల క్రింద ఉంచారు,”#2:8 కీర్తన 8:4-6
సమస్తాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిదీ లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు. 9కాని, యేసు కొంతకాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల అందరి కోసం మరణాన్ని రుచిచూశారు కాబట్టి ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాము.
10ఎవరి కోసం, ఎవరి ద్వారా సమస్తం కలిగిందో ఆ దేవునికి, అనేకమంది కుమారులను కుమార్తెలను మహిమలో తీసుకురావడంలో, వారి రక్షణకు మార్గదర్శి యైన వానిని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయడం తగినదిగా ఉండింది. 11ప్రజలను పరిశుద్ధపరచే వానిది పరిశుద్ధపరచబడిన వారిది ఒక్కటే కుటుంబము. కాబట్టి వారిని సహోదరీ సహోదరులు అని పిలువడానికి యేసు సిగ్గుపడలేదు. 12ఆయన ఇలా అన్నారు,
“నేను మీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను;
సమాజంలో మీ కీర్తిని నేను గానం చేస్తాను.”#2:12 కీర్తన 22:22
13అంతేకాక,
“నేను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతాను.”#2:13 యెషయా 8:17
అంతేకాక,
“ఇదిగో నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు,”#2:13 యెషయా 8:18 అని ఆయన చెప్తున్నారు.
14ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి, 15మరణ భయంతో దాస్యంలో ఉంచబడినవారిని విడిపించడానికి, ఆయన కూడా మానవరూపంలో పాలుపంచుకున్నాడు. 16ఇది ఖచ్చితంగా అబ్రాహాము సంతానానికే గాని దేవదూతలకు సహాయం చేయడానికి కాదు. 17దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు. 18ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు కాబట్టి శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీ పత్రిక 2: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి