34
సిద్కియాకు హెచ్చరిక
1బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యమంతా, అతడు పరిపాలించిన సామ్రాజ్యంలోని అన్ని రాజ్యాలు, జనాంగాలు యెరూషలేముతో పాటు దాని చుట్టుప్రక్కల పట్టణాలన్నిటితో యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది: 2“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: యూదా రాజైన సిద్కియా దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని కాల్చివేస్తాడు. 3నీవు అతని పట్టు నుండి తప్పించుకోలేవు, ఖచ్చితంగా బంధించబడి అతని చేతులకు అప్పగించబడతావు. నీవు బబులోను రాజును నీ కళ్లతో చూస్తావు, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీవు బబులోనుకు వెళ్లిపోతావు.
4“ ‘అయినప్పటికీ యూదా రాజైన సిద్కియా, యెహోవా నీకు చేసిన వాగ్దానాన్ని విను. నీ గురించి యెహోవా ఇలా అంటున్నారు: నీవు ఖడ్గంతో చంపబడవు; 5నీవు సమాధానంగా చనిపోతావు. నీకు ముందుగా పాలించిన రాజులైన నీ పూర్వికుల గౌరవార్థం ప్రజలు సుగంధ ద్రవ్యాలను దహించినట్లే, వారు నీ కోసం కూడా సుగంధద్రవ్యాలు దహిస్తూ, “అయ్యో, యజమానుడా!” అని విలపిస్తారు. నాకు నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
6అప్పుడు యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు ఇదంతా చెప్పాడు. 7ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే.
బానిసలకు విడుదల
8సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది. 9ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు. 10కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు. 11అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.
12అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది: 13“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి, బానిస దేశం నుండి బయటకు రప్పించినప్పుడు వారితో నిబంధన చేసి నేను ఇలా అన్నాను, 14‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా#34:14 ద్వితీ 15:12 వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు. 15ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు. 16కాని ఇప్పుడు మీరు తిరగబడి నా పేరును అపవిత్రం చేశారు. మీలో ప్రతి ఒక్కరు మీ ఆడ, మగ బానిసలను వారు కోరుకున్న చోటికి వెళ్లగలిగేలా వారిని విడుదల చేశారు. కాని మీరు వారిని మళ్ళీ మీ బానిసలుగా ఉండాలని బలవంతం చేశారు.
17“కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: మీరు నా మాట వినలేదు. మీరు మీ సొంత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించలేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ‘స్వాతంత్ర్యాన్ని’ చాటిస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఖడ్గం, తెగులు కరువుతో చావడానికే మీకు ‘విడుదల.’ నేను మిమ్మల్ని భూలోక రాజ్యాలన్నిటికీ అసహ్యమైన వారిగా చేస్తాను. 18నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను. 19యూదా, యెరూషలేము నాయకులు, ఆస్థాన అధికారులు, యాజకులు, దేశ ప్రజలందరు దూడ ముక్కల మధ్య నడిచినవారు, 20వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.
21“నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను. 22నేను ఆదేశాన్ని జారీ చేయబోతున్నాను. వారిని ఈ పట్టణానికి తిరిగి తీసుకువస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని స్వాధీనం చేసుకుని దానిని కాల్చివేస్తారు. నేను యూదా పట్టణాలను ఎవరూ నివసించని విధంగా నాశనం చేస్తాను.”