యోహాను 11:4-15

యోహాను 11:4-15 TCV

యేసు అది విని, “ఈ అనారోగ్యం చావుకు దారి తీయదు. కానీ దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. యేసు మార్తను ఆమె సహోదరి మరియను మరియు లాజరును ప్రేమించారు. లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా, తాను ఉన్నచోటే మరో రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు. అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు. అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు. అతడు రాత్రి వేళ నడిస్తే వెలుగు ఉండదు కనుక అతడు తడబడతాడు” అని చెప్పారు. యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత, ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, కనుక నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు. అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతున్నట్లయితే, కోలుకొంటాడు” అన్నారు. యేసు అతని చావును గురించి మాట్లాడారు, కాని వారు సహజ నిద్ర గురించి అనుకున్నారు. కనుక యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను, దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.