యోహాను 12:1-8

యోహాను 12:1-8 TCV

పస్కా పండుగకు ఆరు రోజుల ముందు, యేసు, తాను చనిపోయినవారిలో నుండి లేపిన లాజరు నివసించే బేతనియ అనే ఊరికి వచ్చారు. ఇక్కడ యేసు కొరకు విందు సిద్ధం చేయబడింది. ఆ భోజనపు బల్ల దగ్గర లాజరు ఆయనతోపాటు కూర్చున్నవారిలో ఉన్నాడు, మార్త వడ్డిస్తుంది. మరియ సుమారు ఐదువందల గ్రాముల, అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది. అయితే ఆయనను అప్పగించబోయే, ఆయన శిష్యులలో ఒకడైన, ఇస్కరియోతు యూదా, ఆమె చేసిన దాని గురించి అభ్యంతరం చెప్తూ, “ఈ పరిమళద్రవ్యాన్ని మూడువందల దేనారాలకు అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇచ్చి ఉండకూడదా? దాని విలువ ఒక పూర్తి సంవత్సరపు జీతానికి సమానం” అన్నాడు. అతడు బీదల మీద ఉన్న శ్రద్ధతో ఈ మాటలను చెప్పలేదు కాని అతడు ఒక దొంగ; డబ్బు సంచి కాపలాదారునిగా, అందులో వేయబడిన డబ్బు తన కొరకు వాడుకునేవాడు. అందుకు యేసు, “ఆమె చేసేది చెయ్యనివ్వండి, ఎందుకంటే నా భూస్థాపన రోజు కొరకు ఆమె ఈ పరిమళద్రవ్యాన్ని సిద్ధపరచింది. బీదలు మీ మధ్య ఎప్పుడు ఉంటారు కాని నేను మీతో ఉండను” అన్నారు.

Free Reading Plans and Devotionals related to యోహాను 12:1-8