15
ఎలీఫజు
1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
2“జ్ఞానం కలవారు వ్యర్థమైన తెలివితో సమాధానం ఇస్తారా?
తూర్పు గాలితో తమ కడుపు నింపుకొంటారా?
3పనికిరాని పదాలతో విలువలేని మాటలతో
వారు వాదిస్తారా?
4నీవు భక్తిని విడిచిపెట్టి
దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు.
5నీ నోరు నీ పాపాలను తెలియజేస్తుంది;
కపటంగా మాట్లాడేవారిలా నీవు మాట్లాడుతున్నావు.
6నేను కాదు, నీ నోరే నిన్ను ఖండిస్తుంది;
నీ పెదవులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి.
7“నీవేమైన మొదట పుట్టిన పురుషునివా?
కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా?
8దేవుని ఆలోచనసభలో నీవు ఉన్నావా?
జ్ఞానం నీకొక్కడికే సొంతమా?
9నీకు తెలిసినది మాకు తెలియనిది ఏమిటి?
నీవు గ్రహించగలిగింది మేము గ్రహించలేనిది ఏమిటి?
10తల నెరసినవారు వృద్ధులైనవారు మా వైపు ఉన్నారు,
వారు వయస్సులో నీ తండ్రి కంటే పెద్దవారు.
11దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా?
ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా?
12-13దేవుని మీద కోప్పడి,
ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా,
నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది
నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి?
14“పవిత్రులుగా ఉండడానికి మనుష్యులు ఏపాటివారు?
నీతిమంతులుగా ఉండడానికి స్త్రీకి పుట్టిన వారు ఏపాటివారు?
15దేవుడు తన పవిత్రులను కూడా నమ్మకపోతే,
ఆయన దృష్టిలో ఆకాశాలు కూడా పవిత్రం కాకపోతే,
16ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు,
ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!
17“నా మాట విను, నేను నీకు వివరిస్తాను;
నేను చూసిన దానిని నీకు చెప్తాను.
18జ్ఞానులు తమ పూర్వికుల దగ్గర నుండి సంపాదించి
దానిలో ఏమీ దాచకుండా చెప్పిన బోధ నీకు చెప్తాను.
19ఇతర ప్రజలు వారి మధ్య లేనప్పుడు
ఆ దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడిన జ్ఞానులు చెప్పిన బోధ నీకు చెప్తాను.
20దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధ అనుభవిస్తాడు.
క్రూరమైనవాడు తనకు నియమించిన సంవత్సరాలన్నీ బాధ అనుభవిస్తాడు.
21భయంకరమైన శబ్దాలు వాని చెవుల్లో మ్రోగుతాయి.
అంతా క్షేమంగా ఉన్నప్పుడు నాశనం చేసేవారు అతనిపై దాడి చేస్తారు.
22చీకటిని తప్పించుకుంటాడనే నమ్మకం అతనికి లేదు;
అతడు ఖడ్గం పాలవుతాడు.
23అతడు ఆహారం కోసం రాబందులా చుట్టూ తిరుగుతాడు;
చీకటి రోజులు సమీపించాయని అతనికి తెలుసు.
24శ్రమ వేదన అతన్ని భయపెడతాయి;
యుద్ధానికి సిద్ధమైన రాజులా అవి అతన్ని ముంచెత్తుతాయి,
25ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు
సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు.
26అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో
ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు.
27“వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ
అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి,
28అతడు పాడైపోయిన పట్టణాల్లో
ఎవరు నివసించని ఇళ్ళలో,
శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.
29ఇక ఎప్పటికీ అతడు ధనవంతునిగా ఉండడు అతని సంపద నిలబడదు.
అతని ఆస్తులు భూమిలో విస్తరించవు.
30అతడు చీకటిని తప్పించుకోలేడు
అతని లేత మొక్కలను అగ్ని కాల్చివేస్తుంది,
దేవుని నోటి ఊపిరిచేత అతడు చనిపోతాడు.
31అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు
ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు.
32అతని కాలం పూర్తి కాక ముందే వాడిపోతాడు,
అతని కొమ్మలు వృద్ధిచెందవు.
33పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా,
పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు.
34భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు,
లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది.
35వారు దుష్టత్వాన్ని గర్భం ధరించి చెడును కంటారు.
వారి కడుపున మోసం పుడుతుంది.”