విలాప 1

1
# 1 ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి 1పట్టణం ఎలా నిర్జనమై ఉంది,
ఒకప్పుడు జనంతో నిండి ఉండేది!
ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది,
ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది!
ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది,
కాని ఇప్పుడు బానిసగా మారింది.
2రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది,
ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది.
ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా
ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు.
ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు;
వారు ఆమెకు శత్రువులయ్యారు.
3బాధ, కఠిన శ్రమ తర్వాత,
యూదా చెరకు వెళ్లిపోయింది.
ఆమె జనాంగాల మధ్య నివసిస్తుంది;
ఆమెకు విశ్రాంతి స్థలం దొరకడం లేదు.
ఆమెను వెంటాడే వారంతా ఆమె కష్టాల మధ్య
ఆమెను దాటి వెళ్లిపోయారు.
4సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి,
ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు.
దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి,
ఆమె యాజకులు మూలుగుతున్నారు,
ఆమె యువతులు దుఃఖపడుతున్నారు,
ఆమె తీవ్ర వేదనలో ఉంది.
5ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు;
ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు;
ఆమె యొక్క అనేక పాపాలను బట్టి
యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు.
ఆమె పిల్లలు చెరకు వెళ్లారు,
వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు.
6సీయోను కుమారి నుండి
వైభవమంతా అంతరించింది.
ఆమె అధిపతులు,
పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు;
బలహీనులై తమను వెంటాడుతున్న వారి
ఎదుటి నుండి పారిపోయారు.
7తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో,
యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ
జ్ఞాపకం చేసుకుంటుంది.
ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు,
వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు.
ఆమె శత్రువులు ఆమె వైపు చూసి
ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.
8యెరూషలేము చాలా పాపం చేసింది
కాబట్టి అపవిత్రమైనది.
ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు,
అందరు ఆమెను నగ్నంగా చూశారు.
ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.
9ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది;
ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు.
ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది;
ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు.
“యెహోవా, నా బాధను చూడు,
ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.”
10ఆమె సంపదలన్నిటినీ
ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు;
యూదేతరుల దేశాలు
ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది,
మీరు మీ సమాజంలోకి
ప్రవేశించకుండ నిషేధించబడినవారు.
11ఆమె ప్రజలందరూ
ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు;
తాము బ్రతికి ఉండడానికి
వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు.
“యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు,
ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.”
12“దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా?
చుట్టూ తిరిగి చూడండి.
యెహోవా నా మీదికి
తన కోపాగ్ని దినాన
తెచ్చిన బాధలాంటి
బాధ ఏదైనా ఉందా?
13“ఆయన పైనుండి అగ్ని పంపారు,
దాన్ని నా ఎముకల్లోకి పంపారు.
నా పాదాలకు వలవేసి
నన్ను వెనుకకు తిరిగేలా చేశారు.
ఆయన నన్ను నిర్జనంగా చేశారు,
నేను బాధతో మూర్ఛపోయాను.
14“నా పాపాలు కాడికి కట్టబడ్డాయి#1:14 కొ. ప్ర. లలో ఆయన నా పాపాలను కనిపెడుతున్నారు;
ఆయన చేతులతో అవి ఒక్కటిగా నేయబడ్డాయి.
అవి నా మెడకు వ్రేలాడదీయబడ్డాయి,
యెహోవా నా బలాన్ని విఫలం చేశారు.
నేను తట్టుకోలేని వారి చేతుల్లోకి
ఆయన నన్ను అప్పగించారు.
15“నా మధ్య ఉన్న బలవంతులందరినీ
యెహోవా తిరస్కరించారు;
నా యువకులను అణచివేయడానికి
ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు.
కన్యయైన యూదా కుమారిని
ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు.
16“అందుకే నేను ఏడుస్తున్నాను
నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి.
నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు,
నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు.
శత్రువు నన్ను జయించాడు కాబట్టి
నా పిల్లలు నిరుపేదలయ్యారు.”
17సీయోను చేతులు చాచింది,
ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు.
యాకోబుకు తన పొరుగువారే
శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు;
యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.
18“యెహోవా నీతిమంతుడు,
అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను.
జనాంగములారా, వినండి;
నా శ్రమను చూడండి.
నా యువకులు, యువతులు
చెరకు వెళ్లారు.
19“సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను
కానీ వారు నన్ను మోసం చేశారు.
నా యాజకులు, నా పెద్దలు
తాము బ్రతికి ఉండాలని
ఆహారం కోసం వెదుకుతూ,
వారు పట్టణంలో చనిపోయారు.
20“యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో!
నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను,
నా హృదయంలో నేను కలత చెందాను,
ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను.
బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది;
లోపల, కేవలం మరణమే.
21“ప్రజలు నా మూలుగు విన్నారు,
కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు.
నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు;
మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు.
మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి
అప్పుడు వారు నాలా అవుతారు.
22“వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి;
నా పాపాలన్నిటిని బట్టి
మీరు నాతో ఎలా వ్యవహరించారో
వారితో కూడా అలాగే వ్యవహరించాలి.
నా మూలుగులు అనేకం
నా హృదయం సొమ్మసిల్లింది.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

విలాప 1: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి