22
యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా
1పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు, 2ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును ఎలా చంపించాలా అని అవకాశం కొరకు చూస్తున్నారు, ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు. 3అప్పుడు పన్నెండు మంది శిష్యులలోని ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. 4కనుక వాడు ముఖ్యయాజకులతో మరియు దేవాలయ కాపలావారి అధికారులతో కలిసి యేసును వారికి ఎలా అప్పగించబోతున్నాడో వారితో చర్చించుకున్నాడు. 5వారు వాని మాటలకు సంతోషించి వానికి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. 6వాడు దానికి అంగీకరించి, ప్రజల గుంపు ఆయనతో లేనప్పుడు యేసును వారికి అప్పగించడానికి అవకాశం కొరకు ఎదురు చూసాడు.
పస్కా పండుగ భోజన ఏర్పాటు
7పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, 8యేసు పేతురు మరియు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు.
9కనుక వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు.
10అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకొని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి, 11ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. 12అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
13వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
14వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. 15ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను. 16ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు.
17ఆయన గిన్నెను తీసుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి. 18దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు.
19ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
20అలాగే, భోజనం చేసిన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కొరకు కార్చబడు నా రక్తంలో క్రొత్త నిబంధన. 21కాని నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడ ఈ బల్ల మీద ఉంది. 22నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు. 23అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.
24అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది. 25యేసు వారితో, “యూదులు కాని రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చెలాయించేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు. 26కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి సేవకునిగా ఉండాలి. 27అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేక సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్న వాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను. 28మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు. 29-30గనుక నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.
31“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు. 32కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు.
33కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.
34అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.
35ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు.
దానికి వారు “ఏమి తక్కువ కాలేదు” అన్నారు.
36అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైబట్టను అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి. 37‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’#22:37 యెషయా 53:12 అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు.
38శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు.
ఆయన వారితో “అవి చాలు!” అని జవాబిచ్చారు.
యేసు ఒలీవల కొండపై ప్రార్థించుట
39-40భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, “మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థించండి” అన్నారు. 41అలా చెప్పి వారి నుండి ఒక రాయి విసిరేంత దూరం వెళ్లి, మోకరించి ఇలా ప్రార్థించారు: 42“తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి.” 43అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. 44ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.
45ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూసారు 46ఆయన వారితో, “మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
యేసు బంధించబడుట
47ఆయన ఇంకా మాట్లాడుతుండగా, ప్రజలు గుంపుగా వచ్చారు, పన్నెండుగురిలో ఒకడైన యూదా అని పిలువబడే వాడు ముందుండి వారిని నడిపించాడు. వాడు యేసుని ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. 48అయితే యేసు వానితో, “యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా?” అని చెప్పారు.
49యేసుతో ఉన్నవారు జరుగబోయేది గ్రహించి, “ప్రభువా, వారిని ఖడ్గంతో నరకమంటావా?” అని ఆయనను అడిగారు. 50అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని కుడి చెవిని నరికాడు.
51అయితే యేసు, “అంతటితో ఆపండి!” అని చెప్పి, వాని చెవిని ముట్టి స్వస్థపరిచారు.
52యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ముఖ్యయాజకులతో, దేవాలయ కాపలావారి అధికారులతో మరియు యూదా నాయకులతో, “నన్ను పట్టుకోవడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? 53నేను ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో కూర్చొని బోధించేటప్పుడు నాపై ఒక చేయి కూడ వేయలేదు. అయినా ఇప్పుడు ఇది మీ సమయం, చీకటి పరిపాలిస్తున్న సమయం” అన్నారు.
యేసును నిరాకరించిన పేతురు
54వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొనివెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు. 55అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు. 56అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, “ఇతడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నది.
57పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
58కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు.
పేతురు “నేను కాదు!” అన్నాడు.
59ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, “వీడు గలిలయుడు కనుక ఖచ్చితంగా వీడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నాడు.
60అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది. 61అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, 62బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
యేసును ఎగతాళి చేసిన కావలివారు
63యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. 64వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు. 65ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.
పిలాతు మరియు హేరోదు ముందుకు యేసు
66ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు. 67“నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు.
అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు. 68ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు. 69కానీ ఇప్పటి నుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు.
70అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు.
అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.
71అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.