మత్తయి 17:1-9

మత్తయి 17:1-9 TCV

ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును వెంట తీసుకొని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు. అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి. అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు. అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకొని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కనుక ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది. శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. కానీ యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి “లేవండి, భయపడకండి” అని చెప్పారు. వారు లేచి కళ్ళు తెరిచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప మరి ఎవరు కనిపించలేదు. వారు కొండ దిగి వస్తునప్పుడు, “మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు” అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.