మత్తయి 2:1-12

మత్తయి 2:1-12 TCV

హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు, తూర్పు దిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము” అని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడు కలతచెందాడు, అతనితో పాటు యెరూషలేమంతా కలతచెందింది. హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉండింది అని వారిని అడిగాడు. అందుకు వారు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని చెప్పారు, “ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు; ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి నీలో నుండి వస్తాడు.’” అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకొన్నాడు. ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కొరకు జాగ్రత్తగా వెదకండి. మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు. వారు రాజు మాటలు విని, బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి నిలిచే వరకు వారి ముందు వెళ్తూ వుండింది. వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు. వారు ఆ ఇంట్లోకి వెళ్లి, ఆ శిశువు తన తల్లియైన మరియతో ఉండడం చూసి, వారు వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ ధనాగారాలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళంను అర్పించారు. వారు వెళ్లిపోవలసిన సమయంలో హేరోదు రాజు దగ్గరకు వెళ్లకూడదని కలలో హెచ్చరిక రావడంతో వారు మరో దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.