మత్తయి 21:1-11

మత్తయి 21:1-11 TCV

వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది: “ ‘ఇదిగో, గాడిద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారి చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నారు,’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు. ఒక గొప్ప జనసమూహం తమ బట్టలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు. ఆయన ముందు వెళ్లే జనసమూహం మరియు ఆయనను వెంబడించేవారు బిగ్గరగా, “దావీదు కుమారునికి హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!” “సర్వోన్నతమైన స్థలాలలో హోసన్నా!” అని కేకలు వేశారు. యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి “ఈయన ఎవరు?” అని అడిగారు. అందుకు ఆ జనసమూహం, “ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త” అని జవాబిచ్చారు.