యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది. ఆయన వారిలో ఒకనికి అయిదు తలాంతుల బంగారం, ఇంకొకనికి రెండు తలాంతుల బంగారం, మరొకనికి ఒక తలాంతు బంగారం, ఎవని సామర్థ్యాన్ని బట్టి వానికి ఇచ్చాడు. తర్వాత అతడు ప్రయాణమై వెళ్లాడు. అయిదు తలాంతుల బంగారం తీసుకున్నవాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా అయిదు తలాంతులను సంపాదించాడు. అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు.
“చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. అయిదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా అయిదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు అయిదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా అయిదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
“అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
“ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడవని నాకు తెలుసు. కాబట్టి నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు.
“అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా? అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసుకునేవాన్ని’ అన్నాడు.
“ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”