యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అన్నాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, నీవు బాగవు” అన్నారు. వెంటనే వాని కుష్ఠురోగం వాన్ని విడిచి వాడు బాగయ్యాడు. అప్పుడు యేసు వానితో, “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. నీవు వెళ్లి యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా మోషే నియమించిన కానుకను అర్పించు” అని చెప్పారు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. అప్పుడు యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని బాగుచేయనా?” అని అన్నారు. అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు నా పనివాడు బాగవుతాడు. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. నా మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వస్తున్నవారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోకి త్రోసివేయబడతారు. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.” అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు. నీవు నమ్మినట్లే నీకు జరుగును గాక” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు బాగయ్యాడు. తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో పడుకుని ఉన్న పేతురు అత్తను చూసి, ఆయన ఆమె చేయిని ముట్టగానే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె లేచి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది. సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని బాగుచేశారు. యెషయా ప్రవక్త ద్వారా పలికిన: “ఆయన మన బలహీనతలను తన మీద వేసుకుని, మన రోగాలను భరించారు” అనే మాటలు నెరవేరేలా ఇలా జరిగింది.
Read మత్తయి సువార్త 8
వినండి మత్తయి సువార్త 8
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి సువార్త 8:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు