మత్తయి 9:18-31

మత్తయి 9:18-31 TCV

ఆయన ఈ సంగతులు వారితో చెప్తున్నప్పుడు, సమాజమందిరపు అధికారి ఒకరు వచ్చి ఆయన ముందు మోకరించి, “నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. కానీ నీవు వచ్చి ఆమె మీద చెయ్యి పెడితే, ఆమె బ్రతుకుతుంది” అన్నాడు. యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు. అప్పుడే, పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును తాకింది. ఆమె తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నేను పూర్తిగా స్వస్థపడతాను” అనుకొంది. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు. ఆ సమయంలోనే ఆ స్త్రీ స్వస్థత పొందుకొంది. యేసు ఆ సమాజమందిరపు అధికారి ఇంట్లోకి వెళ్లినప్పుడు, అక్కడ పిల్లన గ్రోవులు వాయిస్తూ గోల చేస్తున్న గుంపును చూసి, ఆయన వారితో, “బయటికి వెళ్లండి! అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. అందుకు వారు ఆయనను చూసి హేళనగా నవ్వారు. ఆ గుంపును బయటకు పంపివేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేతిని పట్టుకోగానే ఆ అమ్మాయి లేచి నిలబడింది. ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకిపోయింది. అక్కడి నుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గ్రుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వారితో, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని అన్నారు. వారు “అవును, ప్రభూ!” అన్నారు. అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు. వారికి తిరిగీ చూపు వచ్చేసింది. యేసు వారితో, “ఈ సంగతి ఎవ్వరికి తెలియనివ్వకండి” అని తీవ్రంగా హెచ్చరించారు. కానీ వారు బయటకు వెళ్లి, ఆయన గురించి ఆ ప్రాంతం అంతా చాటించారు.