యేసు మరల పడవ ఎక్కి సరస్సు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు, ఆ సరస్సు ఒడ్డున గొప్ప జనసమూహం ఆయన చుట్టూ చేరింది. అప్పుడు సమాజమందిరపు నాయకుల్లో ఒకడైన యాయీరు అనే పేరుగలవాడు వచ్చి, యేసును చూడగానే, ఆయన పాదాల మీద పడ్డాడు. “నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచితే ఆమె బాగై బ్రతుకుతుంది” అని ఆయనను వేడుకున్నాడు. కాబట్టి యేసు అతనితో వెళ్లారు.
పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ మూగారు. పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది. ఆమె యేసు గురించి విన్నప్పుడు, తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని మాత్రం తాకితే చాలు స్వస్థపడతాను” అనుకుని, జనసమూహంలో ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తన శరీరంలో ఉన్న బాధ నుండి తాను విడుదల పొందినట్లు ఆమె గ్రహించింది.
వెంటనే యేసు తనలో నుండి శక్తి బయటకు వెళ్లిందని గ్రహించారు. ఆయన జనసమూహంలో చుట్టూ తిరిగి, “నా వస్త్రాలను ఎవరు తాకారు?” అని అడిగారు.
అందుకు ఆయన శిష్యులు, “ఈ జనసమూహం అంతా నీ మీద పడుతూ ఉండడం నీవు చూస్తూనే ఉన్నావు అయినా, ‘నన్ను ముట్టింది ఎవరు’ అని అడుగుతున్నావు” అని అన్నారు.
అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ, తనకు జరిగింది తెలుసుకొని, వచ్చి ఆయన కాళ్లమీద పడి, భయంతో వణుకుతూ తనకు జరిగిన నిజాన్ని ఆయనకు చెప్పింది. అందుకు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు నీ బాధ నుండి విడుదల పొందుకో” అని చెప్పారు.
యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకునికి శ్రమ కలిగించడం ఎందుకు?” అన్నారు.
యేసు వారు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సమాజమందిరపు అధికారితో, “భయపడకు; నమ్మకం మాత్రం ఉంచు” అని చెప్పారు.
ఆయన పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప మరి ఎవరిని తన వెంట తీసుకెళ్లలేదు. వారు సమాజమందిరపు నాయకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటివారు గట్టిగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, గందరగోళంగా ఉండడం యేసు చూశారు. ఆయన ఇంట్లోకి వెళ్లి వారితో, “మీరెందుకు ప్రలాపించి ఏడుస్తున్నారు? అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. అందుకు వారు ఆయనను హేళన చేశారు.
అయితే ఆయన వారందరిని బయటకు పంపిన తర్వాత, ఆ అమ్మాయి తల్లిదండ్రులను తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని, ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్లారు. ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకుని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు, “చిన్నదానా, లే!” అని అర్థము. వెంటనే ఆ అమ్మాయి లేచి నడవ మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. జరిగిన ఈ సంగతి ఎవనికి తెలియకూడదని ఆయన వారికి ఖచ్చితంగా ఆదేశించి, ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు.