సంఖ్యా 12

12
మోషేను విమర్శించిన మిర్యాము అహరోనులు
1మోషే కూషీయురాలిని పెళ్ళి చేసుకున్నందుకు, అతనికి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు మాట్లాడడం ప్రారంభించారు, 2“యెహోవా కేవలం మోషే ద్వారానే మాట్లాడారా?” అని, “ఆయన మా ద్వారా కూడా మాట్లాడలేక?” అని అన్నారు. యెహోవా వారి మాటలు విన్నారు.
3మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు.
4వెంటనే యెహోవా మోషే, అహరోను మిర్యాములతో, “మీ ముగ్గురు, సమావేశ గుడారం దగ్గరకు రండి” అని చెప్పారు. కాబట్టి ముగ్గురు వెళ్లారు. 5అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చారు; ఆయన గుడార ద్వారం దగ్గర నిలబడి అహరోను, మిర్యాములను పిలిచారు. ఆ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు, 6ఆయన, “నా మాటలు వినండి:
“ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే,
యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను,
కలలలో నేను వారితో మాట్లాడతాను.
7అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు;
అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.
8అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను,
పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను.
అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు.
అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా
నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”
9యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు.
10మేఘం గుడారం నుండి పైకి వెళ్లిపోయాక, మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చి చర్మం మంచులా తెల్లగా మారింది. అహరోను ఆమె వైపు చూసి, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చిందని గ్రహించి, 11అహరోను మోషేతో, “నా ప్రభువా, మేము తెలివితక్కువగా చేసిన పాపాన్ని మా మీదకు తేవద్దు. 12తల్లి గర్భంలో సగం మాంసం కుళ్ళిన శిశువులా ఆమెను కానివ్వకండి” అని అన్నాడు.
13కాబట్టి మోషే యెహోవాకు, “దేవా, దయచేసి ఈమెను స్వస్థపరచు!” అని మొరపెట్టాడు.
14అందుకు యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేస్తే, ఆమె ఏడు రోజులు అవమానంలో ఉండదా? ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచు; ఆ తర్వాత ఆమెను వెనుకకు తీసుకురావచ్చు” అని జవాబిచ్చారు. 15కాబట్టి మిర్యాము శిబిరం బయట ఏడు రోజులు ఉన్నది, ఆమెను తిరిగి తీసుకువచ్చే వరకు ప్రజలు ముందుకు వెళ్లలేదు.
16ఆ పిమ్మట ప్రజలు హజేరోతు నుండి బయలుదేరి పారాను ఎడారిలో గుడారాలు వేసుకున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 12: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి