78
కీర్తన 78
ఆసాపు ధ్యానకీర్తన.
1నా ప్రజలారా! నా ఉపదేశం వినండి;
నా నోటి మాటలు వినండి.
2నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను;
పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.
3మనం విన్నవి మనకు తెలిసినవి
మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను.
4వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;
యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను,
ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి
తర్వాతి తరానికి మేము చెప్తాం.
5ఆయన యాకోబుకు చట్టాలు విధించారు
ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు,
వారి పిల్లలకు దానిని బోధించుమని
మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.
6తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు,
ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు,
వారు వారి పిల్లలకు బోధిస్తారు.
7అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు
ఆయన కార్యాలను మరచిపోరు
ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.
8వారు తమ పితరుల్లా అనగా
మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను,
దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను
ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు.
9ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ,
యుద్ధ దినాన వెనుకకు తిరిగారు;
10వారు దేవుని నిబంధనను పాటించలేదు,
ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు.
11వారు ఆయన చేసిన కార్యాలు,
ఆయన వారికి చూపిన అద్భుతాలను మరచిపోయారు.
12ఆయన వారి పూర్వికుల ఎదుట
ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు.
13ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు;
ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు.
14పగలు మేఘస్తంభమై,
రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు.
15అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు.
సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు.
16ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు
నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.
17కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు
అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు.
18తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ
వారు ఉద్దేశపూర్వకంగా దేవున్ని పరీక్షించారు.
19వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు;
వారు, “ఈ ఎడారిలో దేవుడు
మనకు భోజనం సరఫరా చేయగలడా?
20నిజమే, ఆయన బండరాయిని కొట్టారు,
నీరు బయటకు వచ్చింది,
ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి,
కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా?
ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.
21యెహోవా వారి మాట విని కోపగించారు;
ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది,
ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది.
22ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు.
ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.
23అయినా ఆయన పైనున్న ఆకాశాలను
ఆకాశద్వారాలు తెరిచారు.
24తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు.
పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు.
25మానవులు దేవదూతల ఆహారం తిన్నారు;
ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు.
26ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు.
తన శక్తితో దక్షిణ గాలి విసిరేలా చేశారు.
27ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని,
సముద్రపు ఇసుక రేణువుల్లా పక్షుల్ని వారి మీద కుమ్మరించారు.
28ఆయన వాటిని వారి దండులో
వారి గుడారాల చుట్టూ వంగేలా చేశారు.
29వారడిగిందే దేవుడిచ్చాడు,
వారు కడుపునిండా తిన్నారు.
30కానీ వారి ఆశ తీరకముందే,
ఇంకా ఆహారం వారి నోటిలో ఉండగానే,
31దేవుని కోపం వారి మీదికి రగులుకొంది;
వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు,
ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు.
32ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు;
ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.
33అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా
వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.
34దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు;
వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.
35దేవుడు తమకు కొండ అని,
సర్వోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు.
36అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ
తమ నాలుకలతో ఆయనకు అబద్ధాలు చెప్పారు;
37వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు,
వారు ఆయన నిబంధన పట్ల నమ్మకంగా లేరు.
38అయినా దేవుడు దయ చూపించి;
వారి పాపాలను క్షమించారు
వారిని నాశనం చేయలేదు.
మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు
ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.
39వారు కేవలం శరీరులే అని,
విసరి వెళ్లి మరలి రాని గాలి లాంటి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.
40అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు,
ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు.
41పదే పదే వారు దేవున్ని పరీక్షించారు;
వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు.
42వారు ఆయన శక్తిని గాని,
శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని,
43ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను,
సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు.
44ఆయన వారి నైలు నది కాలువలను రక్తంగా మార్చారు;
వారు తమ ప్రవాహాల నుండి త్రాగలేకపోయారు.
45ఆయన జోరీగల గుంపులను పంపగా అవి వారిని మ్రింగివేశాయి,
కప్పలు వారిని నాశనం చేశాయి.
46ఆయన వారి చేలను పురుగులకు,
వారి పంటలను మిడతలకు అప్పగించారు.
47వడగండ్లతో వారి ద్రాక్షతీగెలను,
మంచుతో వారి మేడిచెట్లను ఆయన నాశనం చేశారు.
48ఆయన వారి పశువులను వడగండ్లకు,
వారి మందలను పిడుగులకు అప్పగించారు.
49నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు
ఆయన వారి మీదికి తన కోపాన్ని
తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు.
50ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు;
ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ,
వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు.
51ఆయన ఈజిప్టులో జ్యేష్ఠులందరిని,
హాము గుడారాల్లో వారి పురుషత్వానికి గుర్తుగా ఉన్న మొదటి సంతానాన్ని చంపారు.
52అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు;
గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.
53ఆయన వారిని క్షేమంగా నడిపించారు,
కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు;
సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు.
54ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు,
ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు.
55వారి ఎదుట నుండి ఇతర దేశాలను తరిమివేసి,
ఆయన వారి భూములను వారికి వారసత్వంగా కేటాయించారు;
ఆయన ఇశ్రాయేలు గోత్రాలను వారి నివాసాల్లో స్థిరపరిచారు.
56కాని వారు దేవున్ని పరీక్షించారు
మహోన్నతుని మీద తిరగబడ్డారు;
వారు ఆయన శాసనాలను పాటించలేదు.
57వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు,
పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు.
58వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు;
వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.
59దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు;
ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు.
60షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని,
మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.
61ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు,
తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు.
62ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు;
ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు.
63అగ్ని వారి యువకులను దహించివేసింది,
వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు;
64వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు
వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు.
65అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా,
ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు.
66ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు;
వారికి నిత్య అవమానాన్ని కలిగించారు.
67అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు,
ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు;
68కాని ఆయన యూదా గోత్రాన్ని,
తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.
69ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా,
భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు.
70ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని,
గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;
71గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి
తన ప్రజలైన యాకోబు మీద,
తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు.
72దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు;
జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.