7
ముద్రింపబడినవారు 1,44,000
1ఈ సంగతుల తరువాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి, భూమి మీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. 2అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పు దిక్కు నుండి మీదికి రావడం చూసాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించే అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, 3“మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను. 4ఆ తరువాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000 మంది ఉన్నారు:
5యూదా గోత్రంలో 12,000 మంది,
రూబేను గోత్రంలో 12,000 మంది,
గాదు గోత్రంలో 12,000 మంది,
6ఆషేరు గోత్రంలో 12,000 మంది,
నఫ్తాలి గోత్రంలో 12,000 మంది,
మనష్షే గోత్రంలో 12,000 మంది,
7షిమ్యోను గోత్రంలో 12,000 మంది,
లేవి గోత్రంలో 12,000 మంది,
ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది,
8జెబూలూను గోత్రంలో 12,000 మంది,
యోసేపు గోత్రంలో 12,000 మంది,
బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడ్డారు.
తెల్లని వస్త్రాలను ధరించివున్న గొప్ప సమూహం
9ఈ సంగతుల తరువాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చినవారు తెల్లని వస్త్రాలను ధరించి ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూసాను. 10వారు తమ స్వరాలను ఎత్తి:
“సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి,
మరియు వధింపబడిన గొర్రెపిల్లకే,
రక్షణ చెందుతుంది”
అని బిగ్గరగా అన్నారు.
11అప్పుడు దేవదూతలు అందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ, 12ఇలా అన్నారు:
“ఆమేన్!
మా దేవునికి స్తోత్రం, మహిమ,
జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు,
ఘనత, శక్తి
ప్రభావం నిరంతరం కలుగును గాక.
ఆమేన్!”
13అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
14అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పగా,
అతడు నాతో ఇలా అన్నాడు, వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. 15అందుకే,
“వీరు దేవుని సింహాసనం ముందు ఉండి,
ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు,
కనుక ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడు
తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
16‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు
దాహం ఉండదు;
సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగులదు,’#7:16 యెషయా 49:10
ఏ వేడి వారిని కాల్చదు.
17ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల
వారికి కాపరిగా ఉండి;
‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’#7:17 యెషయా 49:10
‘దేవుడు వారి కళ్ళలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తాడు.’#7:17 యెషయా 25:8”