12
యెరూషలేము శత్రువులు నాశనం చేయబడతారు
1ఇది ప్రవచనం: ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
ఆకాశాలను విశాలపరచి, భూమికి పునాది వేసి, ఒక వ్యక్తిలో మానవ ఆత్మను సృష్టించిన యెహోవా చెప్తున్న మాట: 2“నేను యెరూషలేమును చుట్టూ ఉన్న ప్రజలందరికి మత్తెక్కించే పాత్రగా చేయబోతున్నాను. యూదా యెరూషలేము ముట్టడి చేయబడతాయి. 3భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు. 4ఆ రోజున నేను ప్రతి గుర్రానికి భయాన్ని, దాని రౌతుకు వెర్రిని పుట్టిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను యూదాపై నా దృష్టి ఉంచి ఇతర ప్రజల గుర్రాలన్నిటికి గుడ్డితనం కలిగిస్తాను. 5అప్పుడు యూదా నాయకులు తమ హృదయాల్లో, ‘యెరూషలేము ప్రజలకు వారి దేవుడైన సైన్యాల యెహోవా తోడుగా ఉన్నందుకు వారు బలంగా ఉన్నారు’ అనుకుంటారు.
6“ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.
7“దావీదు వంశీయులకు యెరూషలేము నివాసులకు ఉన్న ఘనత యూదా వారికంటే గొప్పది కాకుండా యెహోవా మొట్టమొదట యూదా వారి నివాస స్థలాలను రక్షిస్తారు. 8ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు. 9ఆ రోజున యెరూషలేముపై దాడి చేసే దేశాలన్నిటిని నాశనం చేయడానికి నేను బయలుదేరుతాను.
వారు పొడిచిన వాని గురించి దుఃఖించుట
10“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు. 11ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది. 12దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా తమ భార్యలతో పాటు రోదిస్తాయి: దావీదు రాజవంశీయులు వారి భార్యలు, నాతాను వంశీయులు వారి భార్యలు, 13లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు, 14మిగిలిన వంశీయులు వారి భార్యలు అందరు ఎవరికి వారు రోదిస్తారు.