1 రాజులు 19

19
ఏలీయా హోరేబుకు పారిపోవుట
1అహాబు వెళ్లి, ఏలీయా చేసిందంతా ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన సంగతంతా యెజెబెలుకు చెప్పాడు. 2అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది.
3ఏలీయా భయపడి,#19:3 లేదా ఏలీయా చూసి తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి, 4అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు. 5తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు.
అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, “లేచి తిను” అన్నాడు. 6అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు.
7తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, “లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది” అన్నాడు. 8కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు. 9అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు.
యెహోవా ఏలీయాకు ప్రత్యక్షమగుట
యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది.
10అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
11అందుకు యెహోవా, “బయటకు వెళ్లి, పర్వతం మీద యెహోవా సమక్షంలో నిలబడు, ఎందుకంటే యెహోవా అక్కడినుండి దాటి వెళ్లబోతున్నారు” అన్నారు.
అప్పుడు ఒక గొప్ప బలమైన గాలి వచ్చి పర్వతాలను చీల్చింది, యెహోవా ఎదుట బండలను బద్దలు చేసింది, అయితే యెహోవా ఆ గాలిలో లేరు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, కాని యెహోవా ఆ భూకంపంలో లేరు. 12భూకంపం తర్వాత అగ్ని వచ్చింది, కాని యెహోవా ఆ అగ్నిలో లేరు. అగ్ని తర్వాత మెల్లని స్వరం వినిపించింది. 13ఏలీయా ఆ స్వరం వినగానే, తన వస్ర్తంతో ముఖం కప్పుకుని వెళ్లి ఆ గుహ ద్వారం దగ్గర నిలబడ్డాడు.
అప్పుడు అతనికి, “ఏలీయా ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అనే స్వరం వినిపించింది.
14అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
15అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు. 16తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు. 17హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు. 18అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు.
ఎలీషాకు పిలుపు
19కాబట్టి ఏలీయా అక్కడినుండి వెళ్లి, షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నిస్తూ స్వయంగా అతడు పన్నెండవ జతను నడుపుతూ ఉన్నప్పుడు, ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన దుప్పటి తీసి అతని మీద వేశాడు. 20అప్పుడు ఎలీషా ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంబడి పరుగెత్తి, “నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి మీ వెంట వస్తాను” అని అన్నాడు.
అందుకు ఏలీయా, “వెనుకకు వెళ్లు. కాని నేను నీకు చేసిన దాని గురించి ఆలోచించు” అన్నాడు.
21కాబట్టి ఎలీషా అతన్ని విడిచి వెనుకకు వెళ్లి ఆ జత ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మ్రానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు తినిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతని సేవకుడయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 19: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి