1 సమూయేలు 3

3
యెహోవా సమూయేలును పిలుచుట
1బాలుడైన సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వచ్చేది; దర్శనాలు ఎక్కువగా ఉండేవి కావు.
2ఒక రాత్రి, కళ్ళు మసకబారి స్పష్టంగా చూడలేకపోతున్న ఏలీ, తాను ఎప్పుడు పడుకునే స్థలంలో పడుకుని ఉన్నాడు. 3అదే సమయంలో యెహోవా దీపం ఆరిపోక ముందు, యెహోవా మందిరంలో దేవుని మందసం ఉన్నచోట సమూయేలు పడుకుని ఉన్నాడు. 4అప్పుడు యెహోవా సమూయేలును పిలిచారు.
అందుకు సమూయేలు, “నేను ఇక్కడే ఉన్నాను” అంటూ, 5అతడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు నన్ను పిలిచారా? నేను ఇక్కడే ఉన్నాను” అని అన్నాడు.
అందుకు ఏలీ, “నేను పిలువలేదు; వెళ్లి పడుకో” అని చెప్పగానే అతడు వెళ్లి పడుకున్నాడు.
6మళ్ళీ యెహోవా, “సమూయేలూ!” అని పిలిచారు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు.
అయితే ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; వెళ్లి పడుకో” అన్నాడు.
7అప్పటికి సమూయేలుకు ఇంకా యెహోవా తెలియదు; యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు.
8యెహోవా మూడవసారి, “సమూయేలూ!” అని పిలిచినప్పుడు, అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు.
యెహోవాయే ఆ బాలుని పిలిచారని ఏలీ గ్రహించాడు. 9కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు.
10తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు.
వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు.
11అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పారు: “ఇశ్రాయేలీయులలో నేను ఒక పని చేయబోతున్నాను; దాని గురించి విన్నవారి చెవులు గింగురుమంటాయి. 12ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను. 13ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు. 14కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”
15తర్వాత సమూయేలు ఉదయమయ్యే వరకు పడుకుని లేచి, యెహోవా మందిర తలుపులను తెరిచాడు. అయితే తనకు వచ్చిన దర్శనం గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు. 16కాని ఏలీ సమూయేలును, “సమూయేలూ, నా కుమారుడా” అని పిలిచాడు.
అందుకు సమూయేలు, “నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
17అప్పుడు ఏలీ, “యెహోవా నీతో ఏమి చెప్పారు? వాటిలో ఏదీ నా దగ్గర దాచవద్దు. ఆయన నీతో చెప్పిన సంగతుల్లో ఏదైనా నీవు దాచిపెడితే దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు. 18కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.
19సమూయేలు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా, యెహోవా అతనికి తోడుగా ఉండి, సమూయేలు మాటల్లో ఏదీ నేల మీద వ్యర్థంగా పడనివ్వలేదు. 20కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలీయులందరు గుర్తించారు. 21యెహోవా మరలా షిలోహులో దర్శనమివ్వడం ప్రారంభించి, అక్కడ ఆయన తన వాక్కు ద్వారా సమూయేలుకు ప్రత్యక్షపరుచుకున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి