2 దినవృత్తాంతములు 35

35
యోషీయా పస్కాను ఆచరించుట
1యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల పద్నాలుగవ రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించారు. 2యోషీయా యాజకులను వారి విధులకు నియమించి యెహోవా ఆలయ సేవను జరిగించేలా వారిని ప్రోత్సహించాడు. 3ఇశ్రాయేలీయులందరికి బోధించిన, యెహోవాకు ప్రతిష్ఠించబడిన లేవీయులతో అతడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో పవిత్ర మందసాన్ని ఉంచండి. ఇది మీ భుజాలపై మోయకూడదు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు సేవ చేయండి. 4ఇశ్రాయేలు రాజైన దావీదు అతని కుమారుడు సొలొమోను వ్రాసిన సూచనల ప్రకారం, మీ కుటుంబాల విభాగాల ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
5“మీ తోటి ఇశ్రాయేలీయులు, సామాన్య ప్రజల కుటుంబాల్లోని ప్రతి ఉపవిభాగం కోసం లేవీయుల సమూహంతో పరిశుద్ధ స్థలంలో నిలబడండి. 6యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు, పస్కా గొర్రెపిల్లలను వధించి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. మీ తోటి ఇశ్రాయేలీయుల కోసం గొర్రెపిల్లలను సిద్ధం చేయండి.”
7యోషీయా రాజు అక్కడున్న సామాన్యులందరికీ తన సొంత ఆస్తుల నుండి పస్కా అర్పణల కోసం మొత్తం 30,000 గొర్రెపిల్లలు మేకలను అందించాడు, అలాగే 3,000 కోడెలను అందించాడు.
8అతని అధికారులు కూడా ప్రజలకు, యాజకులకు లేవీయులకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. దేవుని ఆలయ బాధ్యత వహించిన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు, యాజకులకు 2,600 గొర్రెపిల్లలు మేకలను పస్కా అర్పణలుగా అందించాడు, అలాగే 300 కోడెలను అందించాడు. 9కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలు, లేవీయుల నాయకులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదులు లేవీయుల కోసం 5,000 గొర్రెపిల్లలు మేకలు 500 కోడెలను పస్కా అర్పణలుగా ఇచ్చారు. 10సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులు స్థలాల్లో లేవీయులు తమ వరుసల్లో నిలబడ్డారు. 11పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 12మోషే గ్రంథంలో వ్రాయబడినట్లుగా, యెహోవాకు అర్పించడానికి ప్రజల కుటుంబాల యొక్క ఉపవిభాగాలకు ఇవ్వడానికి వారు దహనబలులను ప్రక్కన పెట్టారు. పశువుల విషయంలోను అలాగే చేశారు. 13నిర్దేశించబడిన ప్రకారం వారు పస్కా జంతువులను నిప్పుమీద కాల్చారు, అలాగే వారు పరిశుద్ధ అర్పణలను కుండల్లో, బానలలో, కడాయిలలో ఉడకబెట్టి, ప్రజలందరికి త్వరగా వడ్డించారు. 14దీని తర్వాత, వారు తమ కోసం యాజకుల కోసం సిద్ధం చేశారు. ఎందుకంటే అహరోను వంశస్థులైన యాజకులు రాత్రి ప్రొద్దుపోయే వరకు దహనబలులను క్రొవ్వు భాగాలను అర్పించారు. కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను యాజకుల కోసం సిద్ధం చేసుకున్నారు.
15దావీదు, ఆసాపు, హేమాను, రాజుకు దీర్ఘదర్శియైన యెదూతూను నియమించిన ప్రకారం, ఆసాపు వారసులైన సంగీతకారులు తమ స్థలాల్లో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండ వారి బంధువులైన లేవీయులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు.
16ఈ విధంగా రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజు వారు పస్కా పండుగ ఆచరించాడు. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది. 17అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు. 18సమూయేలు ప్రవక్త రోజులనుండి ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా జరగలేదు. యాజకులు, లేవీయులు, హాజరైన యూదా వారందరూ, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేము కాపురస్థులందరితో కలిసి యోషీయా పస్కా ఆచరించిన విధంగా ఇశ్రాయేలు రాజులు ఎన్నడూ ఆచరించలేదు. 19యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది.
యోషీయా మరణము
20ఇదంతా జరిగిన తర్వాత, యోషీయా మందిరాన్ని చక్కబెట్టిన తర్వాత ఈజిప్టు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీదికి యుద్ధానికి వెళ్తుండగా యోషీయా అతని మీదికి బయలుదేరాడు. 21కానీ నెకో అతని దగ్గరకు దూతలను పంపి, “యూదా రాజా, నీకు నాకూ మధ్య ఎలాంటి గొడవ ఉంది? ఈ సమయంలో నేను దాడి చేస్తున్నది మీపై కాదు, నేను యుద్ధం చేస్తున్న ఇంటిపై. దేవుడు నాకు త్వర పడమని చెప్పాడు; కాబట్టి నాతో ఉన్న దేవున్ని ఎదిరించడం మానేయండి, లేదంటే ఆయనే నిన్ను నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
22అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు.
23విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు. 24అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు.
25యిర్మీయా యోషీయా గురించి శోకగీతాన్ని రచించాడు. ఈ రోజు వరకు గాయనీ గాయకులందరు తమ విలాపవాక్కులలో యోషీయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆలపిస్తారు. ఇలా చేయడం ఇశ్రాయేలులో ఒక ఆచారంగా మారింది.
26యోషీయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన మాట అనుసరించి అతడు దయతో చేసిన పనులు, 27మొదటి నుండి చివరి వరకు అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 35: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి