2 రాజులు 12

12
యెవాషు దేవాలయాన్ని బాగుచేయుట
1యెహు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో యెహోయాషు#12:1 హెబ్రీలో యోవాషు; 2, 4, 6, 7, 18 వచనాల్లో కూడా రాజయ్యాడు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది. 2యెహోయాషు యాజకుడైన యెహోయాదా తనకు ఉపదేశిస్తూ ఉన్న కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 3అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
4యెహోయాషు యాజకులతో ఇలా అన్నాడు, “యెహోవా ఆలయానికి పవిత్రమైన కానుకలుగా తెచ్చే డబ్బును అనగా పన్నుగా చెల్లించే డబ్బు, యెహోవా ఆలయానికి ప్రజలు స్వేచ్ఛగా తెచ్చే వ్యక్తిగత మ్రొక్కుబడుల డబ్బును సేకరించండి. 5ప్రతి యాజకుడు కోశాధికారులలో ఒకరి దగ్గర ఆ డబ్బును తీసుకుని, తర్వాత మందిరంలో ఉన్న దెబ్బతిన్న భాగాలు మరమ్మత్తు చేయాలి.”
6అయితే రాజైన యెహోయాషు పరిపాలిస్తున్న ఇరవై మూడవ సంవత్సరం వరకు యాజకులు దేవాలయానికి ఎలాంటి మరమ్మత్తు చేయలేదు. 7కాబట్టి అప్పుడు రాజైన యెహోయాషు యెహోయాదాను, మిగతా యాజకులను పిలిపించి, “మీరెందుకు దేవాలయంలో దెబ్బతిన్న వాటిని మరమ్మత్తు చెయ్యలేదు? ఇక మీ కోశాధికారుల నుండి డబ్బు తీసుకోకండి కాని దేవాలయ మరమ్మత్తు కోసం తీసుకున్న దానిని అప్పగించండి” అన్నాడు. 8అందుకు యాజకులు తాము దేవాలయ మరమ్మత్తు చేయడం లేదు కాబట్టి ప్రజల నుండి డబ్బు తీసుకోవడం మానేస్తామని అంగీకరించారు.
9యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు రంధ్రం చేసి దానిని బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలోనికి వచ్చే వారికి కుడి వైపున ఉంచాడు. ప్రజలు యెహోవా ఆలయానికి తెచ్చే డబ్బంతా ద్వారం దగ్గర ఉండే యాజకుడు ఆ పెట్టెలో వేశాడు. 10పెట్టె నిండిందని వారు చెప్పినప్పుడు రాజ కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా మందిరంలో ఉన్న ఆ డబ్బంతా లెక్కపెట్టి సంచుల్లో కట్టారు. 11ఆ డబ్బును లెక్కించిన తర్వాత, యెహోవా మందిరం మరమ్మత్తు పనులు చేయించేవారికి ఆ డబ్బు పంచి ఇచ్చేవారు. వీరు ఆ డబ్బు మందిరంలో పని చేసే వడ్రంగులకు, కట్టేవారికి, 12తాపీ మేస్త్రీలకు, రాళ్లు కొట్టే వారికి ఇచ్చారు. యెహోవా మందిరం మరమ్మత్తు చేయటానికి దూలాలు, మలిచిన రాళ్లు కొన్నారు. ఆలయ పునరుద్ధరణ కోసం కావలసిన వాటన్నిటి కోసం డబ్బు ఖర్చు చేశారు.
13యెహోవా మందిరం కోసం వెండి గిన్నెలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, పాత్రలు, బూరలు లేదా ఇతర బంగారు, వెండి పరికరాలకు మందిరంలోకి తెచ్చే డబ్బును ఖర్చు చేయలేదు; 14అది యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేస్తున్న పనివారికి ఇవ్వబడింది. 15ఆ డబ్బు తీసుకుని పనుల మీద పైవిచారణ చేసేవారు సంపూర్ణ నమ్మకమైనవారు కాబట్టి, వారు పనివారికి పంచి ఇచ్చిన డబ్బు విషయంలో ఎవరూ లెక్క అడగలేదు. 16అపరాధబలులు, పాపపరిహార బలుల#12:16 లేదా శుద్ధీకరణ అర్పణ వల్ల వచ్చే డబ్బు యెహోవా మందిరంలోనికి తీసుకురాలేదు; అది యాజకునికి చెందినది.
17ఆ సమయంలో అరాము రాజైన హజాయేలు వెళ్లి గాతుపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత యెరూషలేము మీద దాడి చేయాలనుకున్నాడు. 18అయితే యూదా రాజైన యెహోయాషు తన పూర్వికులు, యూదా రాజులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలో, అలాగే రాజభవనంలో ఉన్న ఖజానాలోని బంగారమంతా అరాము రాజైన హజాయేలుకు పంపాడు. కాబట్టి హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.
19యోవాషు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 20యోవాషు సేవకులు కుట్రచేసి, సిల్లాకు వెళ్లే త్రోవలో ఉన్న బేత్-మిల్లోలో అతన్ని చంపారు. 21అతన్ని చంపిన అధికారులు షిమాతు కుమారుడైన యోజాబాదు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు. అతడు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పూర్వికులతో దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 12: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి