దానియేలు 12

12
కడవరి కాలాలు
1“ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు. 2భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి. 3జ్ఞానులైనవారు ఆకాశ ప్రకాశంతో ప్రకాశిస్తారు, అనేకులను నీతిమార్గం లోనికి నడిపించేవారు నక్షత్రాల్లా నిత్యం ప్రకాశిస్తారు. 4అయితే దానియేలూ, నీవు ఈ గ్రంథం యొక్క మాటలను అంత్యకాలం వరకు భద్రపరచి ముద్రించు. చాలామంది జ్ఞానం అధికం చేసుకోవడానికి అటూ ఇటూ వెళ్తూ ఉంటారు.”
5అప్పుడు దానియేలు అనే నేను చూస్తుండగా, నా ఎదుట ఇద్దరు వ్యక్తులు, ఒకడు నది అవతలి ఒడ్డున మరొకడు ఇవతలి ఒడ్డున నిలబడి ఉన్నారు. 6వారిలో ఒకడు, నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తిని, “ఈ భయానకమైన సంఘటనలు జరగడానికి ఎంతకాలం పడుతుంది?” అని అడిగాడు.
7నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తి, తన కుడిచేతిని, తన ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, నిత్యం జీవించే ఆయన మీద ప్రమాణం చేస్తూ, “అది ఒక కాలం, కాలాలు, సగం కాలం#12:7 లేదా ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, సగం సంవత్సరం వరకు జరుగుతుంది. చివరికి పరిశుద్ధుల అధికారం విరగ్గొట్టబడిన తర్వాత, ఇవన్నీ సమాప్తమైతాయి” అని అనడం నేను విన్నాను.
8నేను విన్నాను కాని గ్రహించలేదు. కాబట్టి నేను, “నా ప్రభువా! వీటికి పర్యవసానమేంటి?” అని అడిగాను.
9అతడు జవాబిస్తూ అన్నాడు, “దానియేలూ, నీ మార్గాన్న నీవు వెళ్లు, ఎందుకంటే ఈ సంగతులు అంత్యకాలం వరకు భద్రంగా ముద్రించబడ్డాయి. 10చాలామంది శుద్ధి చేయబడి, మచ్చలేనివారుగా, పవిత్రులుగా అవుతారు, అయితే దుష్టులు దుష్టులుగానే ఉంటారు. దుష్టులెవరు వీటిని గ్రహించరు కానీ జ్ఞానులు గ్రహిస్తారు.
11“అనుదిన నైవేద్యం నిలిపివేయడం, వినాశనం కలిగించే హేయమైనది స్థిరపరచబడడం జరిగే కాలం నుండి 1,290 రోజులు గడచిపోతాయి. 12ఎదురుచూస్తూ 1,335 రోజుల ముగింపు వరకు వేచి ఉండే మనిషి ధన్యుడు.
13“నీవైతే, నీ మార్గాన్న అంతం వరకు వెళ్లు. నీవు విశ్రమిస్తావు, కాలాంతంలో నీవు లేచి నీకు కేటాయించబడిన స్వాస్థ్యాన్ని పొందుకుంటావు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

దానియేలు 12: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి