దానియేలు 3

3
బంగారు విగ్రహం, మండుతున్న అగ్నిగుండం
1నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు.#3:1 అంటే, 27 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పు 2తర్వాత రాజైన నెబుకద్నెజరు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ రావాలని ప్రకటించాడు. 3కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు.
4అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే: 5బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు మీరు విన్నప్పుడు, మీరు సాగిలపడి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించాలి. 6దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”
7కాబట్టి వారు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్న వెంటనే సమస్త దేశాలవారు, వివిధ భాషల ప్రజలు నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహం ఎదుట సాగిలపడి దానిని పూజించారు.
8ఆ సమయంలో కొందరు కల్దీయ జ్యోతిష్యులు#3:8 లేదా కల్దీయులు ముందుకు వచ్చి యూదుల మీద అభియోగం మోపారు. 9వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక! 10రాజా! మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు వినబడిన వెంటనే ప్రజలందరు సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని, 11ఎవరైతే సాగిలపడి పూజించరో, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం జారీ చేశారు. 12అయితే రాజా, మీరు బబులోను సామ్రాజ్య అధికారులుగా నియమించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యూదులు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వారు మీ దేవుళ్ళకు సేవ చేయడం లేదు, పూజించడం లేదు.”
13నెబుకద్నెజరు అతి కోపంతో మండిపోయి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. కాబట్టి వారిని రాజు సముఖానికి తీసుకువచ్చారు. 14అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా? 15ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు.
16షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. 17ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. 18రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు.
19అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి, 20తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. 21కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు. 22రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు. 23షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు.
24అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు.
“అవును రాజా!” అని వారు జవాబిచ్చారు.
25అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు.
26అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు.
కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. 27పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు.
28అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి స్తుతి! ఆయన తన దేవదూతను పంపి తన సేవకులను రక్షించారు! వారాయనను నమ్ముకొని రాజాజ్ఞను ధిక్కరించారు, తమ దేవున్ని తప్ప మరే దేవున్ని సేవించి పూజించమని, తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. 29కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.”
30అప్పుడు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

దానియేలు 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి