ద్వితీయో 15

15
అప్పులను మాఫీ చేసే సంవత్సరం
1ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి. 2రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది. 3మీరు విదేశీయులను అప్పు చెల్లించమని అడగవచ్చు కాని మీ తోటి ఇశ్రాయేలీయుని ప్రతి అప్పు రద్దు చేయాలి. 4అయితే, మీ మధ్యలో పేదవారు ఎవరు ఉండకూడదు, ఎందుకంటే మీ స్వాస్థ్యంగా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని అధికంగా దీవిస్తారు. 5కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించి మీ దేవుడైన యెహోవాకు మీరు పూర్తిగా లోబడి జీవించాలి. 6మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.
7మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు. 8కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి. 9ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు. 10వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు. 11దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.
దాసులను విడుదల చేయుట
12మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి. 13మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు. 14మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి. 15మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.
16కాని ఒకవేళ దాసుడు మీ దగ్గర సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న కారణంగా, “నేను మిమ్మల్ని విడిచి వెళ్లను” అని అంటే, 17మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.
18మీ దాసులను స్వేచ్ఛగా పోనివ్వడానికి మీరు కష్టం భావించవద్దు, ఎందుకంటే ఆరు సంవత్సరాలు వారు మీకు చేసిన సేవ మామూలు కూలివారు చేసే దానికన్నా రెట్టింపు ఉంటుంది. మీరు అలా చేస్తే మీ దేవుడైన యెహోవా మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని దీవిస్తారు.
మొదట పుట్టిన జంతువులు
19పశువుల మందలో మొదట పుట్టిన ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవా కోసం పవిత్రపరచాలి. మీ ఎద్దులలో మొదట పుట్టిన దానితో పని చేయించకూడదు, గొర్రెలలో మొదట పుట్టిన దాని బొచ్చు కత్తిరించకూడదు. 20యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబం వాటిని తినాలి. 21ఆ జంతువుల్లో లోపం అంటే అది కుంటిదైనా గ్రుడ్డిదైనా లేదా వేరే ఏదైన లోపం ఉంటే మీరు దానిని మీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు. 22మీరు దానిని మీ సొంత పట్టణాల్లోనే తినాలి. జింకను దుప్పిని తిన్నట్లు ఆచారరీత్య పవిత్రులు, అపవిత్రులు, ఇద్దరు దానిని తినవచ్చు. 23అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి