ద్వితీయో 17

17
1మీ దేవుడైన యెహోవాకు మచ్చ గాని లోపంగాని ఉన్న ఎద్దునైనా గొర్రెనైనా బలిగా అర్పించకూడదు, అది మీ దేవుడైన యెహోవాకు అసహ్యము.
2ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ, 3నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే, 4ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే, 5ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి. 6ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల వాంగ్మూలం మీదనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి, కానీ ఒక్క సాక్షి వాంగ్మూలంపై ఎవరికి మరణశిక్ష విధించకూడదు. 7ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడంలో మొదట సాక్షుల చేతులు, తర్వాత ప్రజలందరి చేతులు ఉండాలి. మీరు మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
న్యాయస్థానాలు
8మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి. 9లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు. 10మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. 11వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు. 12న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి. 13ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు.
రాజు
14మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకుని స్థిరపడినప్పుడు మీరు, “మన చుట్టూ ఉన్న దేశాలవలె మనమీద కూడా రాజును నియమించుకుందాము” అని అంటే, 15మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు. 16అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు. 17అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.
18అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి. 19అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు, 20తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 17: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి