ఎఫెసీ పత్రిక 1:15-23

ఎఫెసీ పత్రిక 1:15-23 OTSA

ఈ కారణాన్ని బట్టి, ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి, మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలో, ఆయన పరిశుద్ధ ప్రజల్లో ఆయన వారసత్వం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, మనం నమ్మిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి మీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రభావవంతమైన శక్తితోనే క్రీస్తును మృతులలో నుండి లేపి, సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలోను రాబోవు యుగాల్లోను పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకంలో తన కుడి వైపున ఆయనను కూర్చోబెట్టుకున్నారు. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు. సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.