నిర్గమ 10

10
ఎనిమిదవ తెగులు: మిడతలు
1తర్వాత యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని అతని అధికారుల హృదయాలను కఠినం చేశాను తద్వార నేను ఈ నా సూచనలను వారి మధ్య ప్రదర్శించవచ్చు, 2అప్పుడు మీరు మీ పిల్లలకు మనవళ్ళకు నేను ఈజిప్టు వారితో ఎలా కఠినంగా వ్యవహరించానో, వారి మధ్య నా సూచనలను ఎలా కనుపరిచానో చెప్పగలరు, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుంటారు” అన్నారు.
3కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో అన్నారు, “నేను యెహోవాను, హెబ్రీయుల దేవుడు ఇలా చెప్పారు: ‘ఎంతకాలం నిన్ను నీవు నా ఎదుట తగ్గించుకోకుండ ఉంటావు? నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. 4నీవు వారిని వెళ్లనివ్వకపోతే రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను. 5ఎవరు నేలను చూడలేనంతగా అవి నేలను కప్పివేస్తాయి. వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకుని మీకు మిగిలిన కొద్ది దాన్ని కూడా అవి తినివేస్తాయి. మీ పొలంలో పెరుగుతున్న ప్రతి చెట్టును అవి తింటాయి. 6నీ ఇల్లు నీ అధికారులందరి ఇల్లు ఈజిప్టు వారందరి ఇల్లు వాటితో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు గాని మీ పూర్వికులు గాని వారు ఈ దేశంలో స్థిరపడినప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి వాటిని ఎన్నడూ చూడలేదు.’ ” తర్వాత మోషే ఫరో దగ్గర నుండి తిరిగి వచ్చేశాడు.
7ఫరో అధికారులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకి ఉరిగా ఉంటాడు? ఈ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించడానికి వారిని వెళ్లనివ్వు. ఈజిప్టు నాశనం చేయబడుతుందని నీవు గ్రహించవా?” అని అన్నారు.
8అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు.
9అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.
10అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు.#10:10 లేదా జాగ్రత్త, ఇబ్బంది మీ కోసం సిద్ధంగా ఉంది! 11కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు.
12అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశమంతటిమీదికి మిడతల దండు వచ్చి పొలంలో పెరుగుతున్న ప్రతి మొక్కను, వడగండ్ల వలన పాడవని ప్రతిదాన్ని తినివేసేలా నీ చేతిని ఈజిప్టు మీద చాపు” అని చెప్పారు.
13మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి. 14ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు. 15నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు.
16ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. 17దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.
18మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు. 19అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి#10:19 లేదా రెల్లు ఉన్న సముద్రం కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు. 20అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.
తొమ్మిదవ తెగులు: చీకటి
21అప్పుడు యెహోవా మోషేతో, “ప్రతి ఒక్కరూ తడుముకునేంత కటిక చీకటి ఈజిప్టు దేశం మీద కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు” అన్నారు. 22మోషే తన చేతిని ఆకాశం వైపు చాపినప్పుడు మూడు రోజులపాటు ఈజిప్టు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది. 23ఆ మూడు రోజులు ఎవరూ ఎవరిని చూడలేకపోయారు తామున్న చోట నుండి లేవలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో వెలుగు ఉంది.
24అప్పుడు ఫరో మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను సేవించండి. మీ స్త్రీలు పిల్లలను కూడా మీతో వెళ్లవచ్చు; కాని మీ గొర్రెలు పశువులను ఇక్కడే వదిలేయండి” అన్నాడు.
25అందుకు మోషే, “మేము మా దేవుడైన యెహోవాకు బలులు, దహనబలులు అర్పించడానికి కావలసిన పశువులను నీవు మాకు ఇవ్వాలి. 26మా పశువులు కూడా మాతో రావాలి; ఒక్క డెక్క కూడా వదిలిపెట్టము. మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిలో నుండే మేము తీసుకోవాలి, మేము అక్కడికి వెళ్లి మేము వేటితో యెహోవాను సేవించాలో మాకు తెలియదు” అన్నాడు.
27అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు వారు వెళ్లడానికి ఒప్పుకోలేదు. 28అప్పుడు ఫరో మోషేతో, “నా ఎదుట నుండి వెళ్లిపో! మరలా నీవు నాకు కనపడకుండా చూసుకో! నీవు నా ముఖాన్ని చూసిన రోజునే నీవు మరణిస్తావు” అన్నాడు.
29అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమ 10: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి