ఆది 2:18-25

ఆది 2:18-25 OTSA

యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు. యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది. ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు. అయితే మనుష్యునికి తగిన తోడు దొరకలేదు. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు. అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు. అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు: “ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం; ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.” అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు. ఆదాము, అతని భార్య, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు అనిపించలేదు.

చదువండి ఆది 2