యెషయా 25

25
యెహోవాకు స్తుతి
1యెహోవా, మీరే నా దేవుడు;
నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను,
పరిపూర్ణ నమ్మకత్వంతో
మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన
అద్భుతాలను మీరు చేశారు.
2మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా
కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా,
విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు;
అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.
3కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు;
క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి.
4మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు,
అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు,
తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా,
వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు.
ఎందుకంటే, క్రూరుల శ్వాస
గోడకు తాకే తుఫానులా,
5ఎడారి వేడిలా ఉంటుంది.
మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు;
మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లు
క్రూరుల పాట నిలిపివేయబడుతుంది.
6ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా
ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు
ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది
లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.
7ఈ పర్వతంపై ఆయన
ప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగును
సమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు;
8శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు.
ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది
కన్నీటిని తుడిచివేస్తారు;
సమస్త భూమి మీద నుండి
తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు.
యెహోవా ఇది తెలియజేశారు.
9ఆ రోజున వారు ఇలా అంటారు,
“నిజంగా ఈయనే మన దేవుడు
ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు.
మనం నమ్మిన యెహోవా ఈయనే;
ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”
10యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది;
అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు,
మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.
11ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు
వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు.
వారి చేతులు యుక్తితో ఉన్నా
దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.
12మోయాబూ, నీ ఎత్తైన కోటలను
ఆయన పడగొడతారు.
వాటిని నేలకు అణగద్రొక్కి
ధూళిలో పడవేస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 25: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి