యెషయా 34

34
దేశాలపై తీర్పు
1దేశాల్లారా, నా దగ్గరకు వచ్చి వినండి;
ప్రజలారా, మీరు శ్రద్ధగా వినండి!
భూమి దానిలోని సమస్తం,
లోకం, దాని నుండి వచ్చేవన్ని వినును గాక.
2సమస్త దేశాల మీద యెహోవా కోపంగా ఉన్నారు;
వారి సైన్యాలన్నిటి మీద ఆయన ఉగ్రత ఉంది.
ఆయన వారిని#34:2 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు ఇవ్వడాన్ని సూచిస్తుంది; 5 వచనంలో కూడా పూర్తిగా నాశనం చేస్తారు,
వారిని వధకు అప్పగిస్తారు.
3వారిలో చంపబడినవారు పూడ్చిపెట్టబడరు,
వారి శవాలు కంపుకొడతాయి.
పర్వతాలు వారి రక్తంతో తడిసిపోతాయి.
4ఆకాశ నక్షత్రాలన్నీ కరిగిపోతాయి
గ్రంథపుచుట్టలా ఆకాశాలు చుట్టబడతాయి;
ద్రాక్షతీగె నుండి వాడిన ఆకు రాలినట్లుగా
అంజూర చెట్టు నుండి వాడిన కాయ రాలినట్లుగా
నక్షత్ర సైన్యమంతా రాలిపోతుంది.
5ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది;
చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి,
నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది.
6యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది,
అది క్రొవ్వుతో కప్పబడి ఉంది.
గొర్రెపిల్లల, మేకల రక్తంతో,
పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది.
ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు.
ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.
7వాటితో పాటు అడవి ఎద్దులు,
కోడెలు, బలమైన ఎద్దులు చస్తాయి.
వారి భూమి రక్తంతో తడుస్తుంది.
వారి మట్టి క్రొవ్వులో నానుతుంది.
8యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును,
సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.
9ఎదోము నీటిప్రవాహాలు కీలుగా
దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది.
దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది.
10అది రాత్రింబగళ్ళు ఆరిపోదు;
దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది.
అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది;
దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు.
11గూడబాతులు, జీరగపిట్ట దానిని స్వాధీనం చేసుకుంటాయి;
గుడ్లగూబ, కాకి దానిలో నివసిస్తాయి.
దేవుడు తారుమారనే కొలమానాన్ని
శూన్యమనే మట్టపు గుండును
ఏదోముపై చాపుతారు.
12రాజ్యమని ప్రకటించడానికి వారి ఘనులకు అక్కడ ఏమీ మిగలదు,
వారి అధిపతులందరు మాయమవుతారు.
13దాని కోటలలో ముళ్ళచెట్లు,
దాని దుర్గాలలో దురదగొండ్లు గచ్చపొదలు పెరుగుతాయి.
అది తోడేళ్లకు నివాసంగా
గుడ్లగూబలకు ఇల్లుగా ఉంటుంది.
14ఎడారి జీవులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి
అడవి మేకలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడతాయి;
అక్కడ రాత్రివేళ తిరిగే ప్రాణులు కూడా పడుకుంటాయి
అక్కడ అవి వాటికి విశ్రాంతి స్థలాలను కనుగొంటారు.
15అక్కడ గుడ్లగూబ గూడు కట్టి గుడ్లు పెట్టి,
వాటిని పొదిగి, తన రెక్కల నీడలో వాటిని ఉంచి,
దాని పిల్లలను పోషిస్తుంది.
అక్కడ తెల్ల గద్దలు
ప్రతి ఒక్కటి తమ జాతి పక్షులతో జతకడతాయి.
16యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి:
వీటిలో ఏవి తప్పిపోవు,
ఏ ఒక్కటి కూడా తన జత లేకుండా ఉండదు.
ఎందుకంటే, ఆయన నోరే ఈ ఆదేశాన్ని ఇచ్చింది,
ఆయన ఆత్మ వాటిని పోగుచేస్తారు.
17ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు;
ఆయన చేతి కొలత ప్రకారం వాటికి పంచిపెడుతుంది.
అవి శాశ్వతంగా దానిని స్వాధీనం చేసుకుంటాయి
తరతరాలు అందులో నివసిస్తాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 34: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి