యెషయా 54

54
సీయోనుకు కలుగబోయే మహిమ
1“గొడ్రాలా, పిల్లలు కననిదానా,
పాటలు పాడు.
ప్రసవవేదన పడనిదానా,
ఆనందంతో కేకలు వేయి.
ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే
విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు”
అని యెహోవా తెలియజేస్తున్నారు.
2“నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి.
నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా
ముందుకు పొడిగించు
నీ త్రాళ్లను పొడవుగా చేయి.
నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.
3నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు;
నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని
నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.
4“భయపడకు; నీవు సిగ్గుపరచబడవు
అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు.
నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు
నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.
5నిన్ను సృష్టించినవాడే నీ భర్త
ఆయన పేరు సైన్యాల యెహోవా,
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు;
ఆయన భూమి అంతటికి దేవుడు.
6విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు
తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు,
యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు”
అని నీ దేవుడు చెప్తున్నారు.
7“కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను,
కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.
8తీవ్రమైన కోపంలో
కొంతకాలం నీవైపు నేను చూడలేదు
కాని నిత్యమైన కృపతో
నీపై జాలి చూపిస్తాను”
అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.
9“ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది,
జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను.
అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని
నేను ప్రమాణం చేశాను.
10పర్వతాలు కదిలినా
కొండలు తొలగిపోయినా
నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు.
నా సమాధాన నిబంధన తొలిగిపోదు”
అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.
11“తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా,
వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను,
నీలమణులతో నీ పునాదులను వేస్తాను.
12రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు,
మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు
ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.
13యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు
వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.
14నీవు నీతిలో స్థాపించబడతావు:
బాధించేవారు నీకు దూరంగా ఉంటారు.
నీవు దేనికి భయపడే అవసరం లేదు.
భయం నీకు దూరంగా ఉంటుంది.
అది నీ దగ్గరకు రాదు.
15ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు;
నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు.
16“చూడు, నిప్పులు ఊది మండించి
తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే
కమ్మరిని సృజించింది నేనే.
నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే.
17నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు,
నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు.
యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే,
నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 54: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి